కెసీఆర్ కు డేంజర్ బెల్స్!
తెలంగాణ దేశానికే ఆదర్శం. దేశం అంతా తెలంగాణను కాపీకొడుతోంది. పరిపాలనలో కొత్తపుంతలు తొక్కిస్తున్నాం. దేశాన్ని సాకుతున్న కీలక రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇవీ ముఖ్యమంత్రి కెసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కెటీఆర్ నిత్యం చెప్పే మాటలు.. మరి ఈ మాటలను తెలంగాణ ప్రజలు ఏ మాత్రం నమ్మటం లేదా?. చెప్పేదానికి..క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి లింక్ కుదరటం లేదా?. తాజాగా వెల్లడైన ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్, సీ -ఓటర్ సర్వే ఇదే విషయాన్ని చెబుతున్నాయి. దేశంలోనే అత్యంత ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న సీఎంగా కెసీఆర్ ఉండటం కీలకంగా మారింది. పలు వర్గాల్లో సీఎం కెసీఆర్ పై తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతతోపాటు సమాజంలోని పలు వర్గాలు కెసీఆర్ మాటలను విశ్వసించటం మానేశారు. అందుకే తాజాగా ప్రకటించిన దళితబంధు స్కీమ్..ఆ తర్వాత కెసీఆర్ చేసిన ప్రకటనలే నిదర్శనం. కొద్ది రోజుల క్రితం మంత్రి కెటీఆర్ అసలు సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం ఏముంది?. జిల్లాల్లో మంత్రులు..ఎమ్మెల్యేలు..అధికారులు ఉంటారు కదా అని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా సీఎం బయటకు వచ్చి ప్రజల వినతులు విన్నారంటే వ్యవస్థ సరిగా పనిచేయటంలేదనే అంటూ కొత్త సిద్ధాంతాన్ని కూడా తెరపైకి తెచ్చారు. కానీ అదే కెసీఆర్ అకస్మాత్తుగా దళితబంధు స్కీమ్ ప్రకటించి గ్రామాల్లో తిరిగి..అక్కడి ఇళ్లు, గల్లీలు కూడా తిరిగారు.
అంటే తాము ఏది చేస్తే అదే రూల్..అదే వ్యవస్థ అన్నట్లు వ్యవహరించటంలో సీఎం కెసీఆర్ ముందు వరసలో ఉంటారు. ఇతర పార్టీల దగ్గర నుంచి ఫిరాయింపులతో పాటు పలు విషయాల్లో ఆయన తీరు అలాగే ఉంది. పాత సచివాలయాన్ని కూల్చేసి..వందల కోట్ల రూపాయలతో కొత్త సచివాలయ నిర్మాణం..రెవెన్యూలో అన్ని సమస్యలకు జిందా తిలిస్మాత్ అంటూ తీసుకొచ్చిన ధరణి ఇప్పటికీ చుక్కలు చూపిస్తూనే ఉంది. ఒక్క కెసీఆర్ విషయంలోనే కాదు..క్షేత్ర స్థాయిలో చాలా మంది ప్రజాప్రతినిధుల తీరు కూడా టీఆర్ఎస్ పై ..కెసీఆర్ పై వ్యతిరేకత పెంచటానికి కారణంగా ఉందని సమాచారం. ఈ సర్వే కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు రావటం టీఆర్ఎస్ కు బిగ్ షాక్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఆ పార్టీ ఎదురుగాలి వీస్తోందని సమాచారం. ఈ సర్వేను కూడా బిజెపి, కాంగ్రెస్ లు ప్రచారం చేస్తే అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ సర్వే అంచనాలు నిజం అయి...ఆ ఫలితం హుజూరాబాద్ లో కూడా ప్రతిఫలిస్తే వచ్చే రెండేళ్ళు టీఆర్ఎస్ మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు..రకరకాల కారణాలతో ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చిన నేతలు గళం విన్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.