Telugu Gateway
Telangana

ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక తప్పదా!

ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక తప్పదా!
X

తెలంగాణ లో మరో ఉప ఎన్నిక తప్పేలా లేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హై కోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో ఈ సీటు ఖాళీ అయినట్లే..మరో ఆరు నెలల్లో ఇక్కడ ఎన్నిక జరగటం అనివార్యంగా కనిపిస్తోంది. నాగేందర్ పై అనర్హత వేటు వేయటమే కాకుండా ఆయన సీటు ఖాళీ అయినట్లు తెలంగాణ హై కోర్టు స్పీకర్ తో పాటు ఎన్నికల సంఘానికి కూడా సమాచారం ఇచ్చింది. అయితే హై కోర్ట్ తీర్పుపై సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించేందుకు దానం నాగేందర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎలా చూసుకున్నా కూడా దానం నాగేందర్ కు ఊరట దక్కటం అనుమానమే అన్నది ఎక్కువ మంది న్యాయనిపుణులు చెపుతున్న మాట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు పలువురు ఆ పార్టీ కి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

దీనిపై బిఆర్ఎస్ తో పాటు మరో పార్టీ బీజేపీ కూడా ఫిర్యాదులు చేసింది. పార్టీ ఫిరాయించిన వాళ్లకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారు అంటూ బిఆర్ఎస్ సుప్రీం కోర్ట్ ను కూడా ఆశ్రయించింది. పలు మార్లు కోర్ట్ లు గడువు విధించిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలు దఫాలు విచారణ జరిపి దానం నాగేందర్ తో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ ఫిరాయించలేదు అని తీర్పు ఇచ్చారు. కానీ అంతా ఒక్క దానం నాగేందర్ పై ఖచ్చితంగా అనర్హత వేటుపడుతుంది అని భావించారు. కానీ స్పీకర్ అందరిలాగేనే దానం విషయం లో కూడా తన తీర్పు వెలువరించారు.

మిగిలిన వాళ్లకు దానం నాగేందర్ ఫిరాయింపుకు మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాంగ్రెస్ లో చేరటమే కాకుండా ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలు అయ్యారు. తాజాగా తెలంగాణా హై కోర్ట్ ఆయనపై అనర్హత వేటువేయటానికి ఇదే విషయాన్ని ప్రధాన ఆధారంగా తీసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ లో బీజేపీ పక్ష నాయకుడు మహేశ్వర రెడ్డి తో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హై కోర్టును ఆశ్రయించారు. పలు దఫాలు విచారణ జరిపిన కోర్ట్ శుక్రవారం నాడు తన తీర్పు వెలువరిస్తూ దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసింది. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ ఎస్ నేతలు హై కోర్ట్ తీర్పును స్వాగతిస్తున్నారు. పార్టీ మారిన మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఇదే గతి పడుతుంది అని హెచ్చరిస్తున్నారు.

Next Story
Share it