Telugu Gateway
Telangana

ఓటు ఎవ‌రికైనా వేసుకోవ‌చ్చు...ద‌ళిత‌బంధుతో ముడిపెట్టం

ఓటు ఎవ‌రికైనా వేసుకోవ‌చ్చు...ద‌ళిత‌బంధుతో ముడిపెట్టం
X

ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి ముఖ్య‌మంత్రి కెసీఆర్ అసెంబ్లీలో మంగ‌ళ‌వారం నాడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీల‌కు అతీతంగా ఈ ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌ని..ల‌బ్దిదారులు ఓటు ఎవ‌రికైనా వేసుకోవ‌చ్చ‌న్నారు. ఓట్ల‌తో దీనికి ముడిపెట్టం అని ప్ర‌క‌టించారు. ద‌ళిత‌బంధు ఆలోచ‌న ఎప్ప‌టిదో అని..హుజూరాబాద్ ఎన్నిక‌ల‌కు దీనికి సంబంధం లేద‌ని మ‌రోసారి పున‌రుద్ఘాటించారు. రాష్ట్రంలో అన్ని ఎస్సీ కుటుంబాల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తించేలా చూస్తామ‌న్నారు. హుజూరాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత కూడా త‌మ ప్ర‌భుత్వ‌మే ఉంటుంద‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా తామే గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కొంత మంది రంగుల క‌ల‌లు క‌నొచ్చ‌ని విప‌క్ష పార్టీల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. వ‌చ్చే మార్చిలోపు వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌లు చేస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కం అమ‌లుకు మూడు వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గానికి వంద మందిని ఎంపిక చేసే బాధ్య‌త ఎమ్మెల్యేదే అని..వ‌చ్చే బ‌డ్జెట్ లో ఈ ప‌థ‌కం అమ‌లు కోసం 20 వేల కోట్ల రూపాయ‌లు పెట్టనున్న‌ట్లు తెలిపారు. కరోనా కన్నా ముందే దళిత బంధు ఆలోచన చేశామ‌ని, కానీ కోవిడ్‌ వల్ల ఆలస్యమయ్యింద‌న్నారు.

దీనిపై విపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబబ్లీలో అసహనం వ్యక్తం చేశారు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ దళిత బంధు సహా పలు అంశాలపై మాట్లాడారు. ''ఈ దేశంలో నేటికి కూడా వెనకబడిన సామాజిక వర్గం దళితులే. వారు దయనీయ స్థితిలో ఉన్నారు. సామాజిక వివక్ష కారణంగానే దళితులు పేదరికంలో ఉన్నారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళితులందరి పరిస్థితి ఇలానే ఉంది. వారిని అభివృద్ధి చేయడం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు'' అని కేసీఆర్‌ తెలిపారు. 'దళిత బంధు పథకంపై చర్చకు అన్ని పార్టీలను ఆహ్వానించాం. మా పాటికి మేము చేయలేదు. ప్రగతి భవన్‌లో దళిత బంధు పథకం అమలుపై పదిన్నర గంటలు చర్చించాం.

ముస్లింల‌కు కూడా ద‌ళిత బంధు త‌ర‌హా ప‌థ‌కం తెస్తామ‌ని..అయితే దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. దళితుల శాతం దేశంలో పెరిగింది. దళితుల రిజర్వేషన్ల శాతం పెంచాలి. కేంద్రం దాన్ని గుర్తించాలి. కేంద్రం బీసీ కులగణన చెయ్యడానికి ఎందుకు నిరాకరిస్తోంది. బీసీల కులగణన చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పంపుతాం. ఎస్సీ రిజర్వేషన్లపై శాసనసభలో తీర్మానం చేసి పంపినా కేంద్రం పక్కన పెట్టింది. రఘునందన్ రావు కేంద్రం నుంచి రిజర్వేషన్లు అమలు చేసుకోని తెస్తే ఘనంగా సన్మానం చేసి స్వాగతం పలుకుతాం'' అని కేసీఆర్‌ తెలిపారు. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఇప్పటి వరకు 1, 51,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాము. 1,31,000 ఉద్యోగాలు ఇచ్చాము. త్వరలోనే ఉద్యోగాలు పొందిన వారి లిస్ట్ అసెంబ్లీకి ఇస్తాం. రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు స్టార్ట్ అవుతాయి. నాకున్న అంచనా మేరకు 80 వేల వరకు ఉద్యోగాలు రాబోతున్నాయి.' అన్నారు.

Next Story
Share it