Telugu Gateway
Telangana

రేప‌టి నుంచే ఖాతాల్లో ద‌ళిత బంధు నిధులు జ‌మ‌

రేప‌టి నుంచే ఖాతాల్లో ద‌ళిత బంధు నిధులు జ‌మ‌
X

తొలుత వాసాల‌మ‌ర్రిలో 76 కుటుంబాల‌కు

ముఖ్య‌మంత్రి కెసీఆర్ ద‌ళిత బంధుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం నాడే వాసాల‌మ‌ర్రి గ్రామంలో 76 కుటుంబాల‌కు ద‌ళిత బంధు వ‌ర్తింప చేయ‌నున్నట్టు ప్ర‌క‌టించారు. ఒక్కో కుటుంబం ఖాతాలో గురువారం నాడే ప‌ది ల‌క్షల రూపాయ‌లు జ‌మ అవుతాయ‌ని తెలిపారు. ద‌ళిత బంధుపై పూర్తి బాధ్య‌త ఆ కుటుంబాల‌దే అన్నారు. ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో 30 కోట్ల రూపాయ‌ల‌తో ద‌ళిత ర‌క్షణ నిధి ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ద‌ళిత బంధు ద్వారా తెలంగాణ‌లో మొత్తం ద‌ళిత జాతిని బాగు చేయ‌బోతున్నామ‌ని అన్నారు. దేశం మొత్తం అంద‌రూ తెలంగాణ వైపు చూడాల‌న్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కెసీఆర్ దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి 'దళితబంధు' పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ''భారతదేశంలో ఏళ్లుగా అణచివేతకు గురైన జాతి దళిత జాతి. కొందరు మహాత్ములు ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించారు. వారిలో ముఖ్యులు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌. 60 ఏళ్ల క్రితం ఆయన దళితుల కోసం పోరాటం చేయగా విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు లభించాయి. ఆయన మార్గం చూపారు. కానీ పూర్తి స్థాయిలో దళితుల అభివృద్ధి జరగలేదు. గత ప్రభుత్వాలు సరైన దిశలో దళితుల అభివృద్ధి గురించి ఆలోచించకపోవడం వల్లనే వారు ఇంకా పేదలుగానే ఉన్నారు' అని తెలిపారు.

'20 ఏళ్లు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఈ రోజు 24 గంటల కరెంటు ఇస్తున్నాం. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నాం. గొల్ల, కురమలకు గొర్రెలు, గీత కార్మికులకు సాయం, సామాజిక వర్గాల వారిగా చేయూత అందిస్తున్నాం. ముసలి, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్‌ ఇస్తున్నాం'' అని కేసీఆర్‌ తెలిపారు. ''ఏడాది క్రితమే దళిత బంధు ప్రారంభం కావాల్సి ఉండే. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అందుకే ఈ మధ్యనే దాన్ని ప్రారంభించాం. నెలల పాటు ఆలోచించి.. ఈ పథకాన్ని రూపొందించాం. దీన్ని విఫలం కానివ్వొద్దు. లబ్ధిదారులు దీన్ని వాడుకుని అభివృద్ధి చేసి చూపించాలి. దళితవాడలు ఐకమత్యంగా ఉండాలి. ఈర్ష్య , కోపం లేకుండా అందరం ప్రేమ భావనతో ఉండాలి. పథకాన్ని విజయవంతం చేయాలి'' అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఒక్క ద‌ళిత బంధే కాదు.రైతుల‌కు చేయ‌టం లేదా రైతు బంధు అమ‌లు చేయ‌టంలేదా అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it