Telugu Gateway
Telangana

భారత రత్న ఇచ్చినా తక్కువే !

భారత రత్న ఇచ్చినా తక్కువే !
X

మాటలతో మాయ చేయటంలో...మాయా ప్రపంచాలను సృష్టించటంలో దేశంలోనే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ని కొట్టేవాళ్ళు ఎవరూ ఉండరనే ప్రచారం ఉండేది నిన్నమొన్నటి వరకు. ఎందుకంటే కెసిఆర్ మాటలు అలా ఉంటాయి. గత రెండు దశాబ్దాలకు పైగా కెసిఆర్ ను చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో స్వేద పత్రం పేరుతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన లెక్కలు చూసిన తర్వాత అందరూ కేటీఆర్ ఈ విషయంలో తన తండ్రి కెసిఆర్ ను మించి పోయారు అని వ్యాఖ్యానిస్తున్నారు. బిఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ లో 50 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంపద సృష్టించింది అని కెటిఆర్ చెప్పిన మాటలు చూసి...ఐఏఎస్ లే కాకుండా..ప్రతి ఒక్కరూ అవాక్కు అవుతున్నారు. ఇదే నిజం అయితే వీళ్లకు భారత్ రత్న అవార్డు కూడా చాలా చాలా తక్కువే అవుతుంది అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. కాసేపు కేటీఆర్ చెప్పిందే నిజం అనుకుందాం...అంత సంపద సృష్టించే సత్తా ఉన్న కెసిఆర్, కేటీఆర్ ల ప్రభుత్వం హైదరాబాద్ తో పాటు రాష్ట్రం అంతటా ఉన్న ప్రభుత్వ భూములు ఎడా పెడా ఎందుకు అమ్మినట్లు, స్వయంగా కేటీఆర్ నిర్వహించిన మున్సిపల్ శాఖ కు సంబంధించి హైదరాబాద్ లో మ్యాన్ హోల్స్ లేక చిన్నారులు ఎందుకు మృతు వాత పడినట్లు, గత ప్రభుత్వాలు కట్టిన ఓఅర్ఆర్ ను ఎందుకు దీర్ఘకాల లీజ్ కు ఇచ్చినట్లు , రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం టాయిలెట్ సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయినట్లు?. పదేళ్ల లో పేదలకు ఒక్క తెల్ల రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేకపోయినట్లు..హాస్టల్స్ లో విద్యార్థులకు భోజనం పెట్టే వాళ్లకు సకాలంలో బిల్స్ ఎందుకు చెల్లించలేకపోయినట్లు?. ఇలా చెప్పుకుంటే పోతే ఈ జాబితా ఎక్కడా తెగదు. ఎన్నికల సమయంలో ఫేక్ అంశాలను ప్రచారం చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేటీఆర్ ...ఇప్పుడు తాము 50 లక్షల కోట్ల సంపద సృష్టించామని చెప్పటం ద్వారా రాజకీయ నాయకుల్లో ఒక ఒక కొత్త లెవెల్ కు వెళ్లారని చెపుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన వాటిలో తప్పులు ఉంటే ప్రతిపక్ష పార్టీగా..నిన్న మొన్నటివరకు అధికారంలో ఉన్న పార్టీగా బిఆర్ఎస్ కౌంటర్ ఇవ్వటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ చెప్పే విషయాలు కాస్త ప్రజలు నమ్మేలా..వాస్తవాలకు దగ్గరగా ఉంటే ఓకే. కానీ ఏకంగా తాము 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం అంటే మాత్రం అందరూ షాక్ లోకి వెళ్లారు అనే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లోపాలు కళ్ల ముందు కనిపిస్తున్నా అది ఒక అద్భుతం అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేయటం అంటే కేటీఆర్ కే చెల్లింది. ప్రపంచ రికార్డు అని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టిన నాలుగేళ్లకే మేడిగడ్డ పిల్లర్లు కుంగటాన్ని చిన్న తప్పుగా కేటీఆర్ సమర్ధించుకుంటున్న తీరు దారుణం అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు 6 .71 లక్షల కోట్ల రూపాయలను దాటితే కేటీఆర్ మాత్రం గ్యారంటీ రుణాలను పక్కన పెట్టి అప్పు కేవలం 3 .17 లక్షల కోట్లే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ కార్పొరేషన్లు, ఎస్పీవి లు తీసుకున్న రుణాలను కూడా కట్టాల్సింది ప్రభుత్వమే కాబట్టి ఇవి కూడా ప్రభుత్వ రుణాల కిందే వస్తాయని అధికారులు చెపుతున్నారు. ఒక వైపు ఫేక్ ప్రచారాలు...మరో వైపు 50 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించాం అనే కేటీఆర్ మాటలు చూసిన తర్వాత భవిష్యత్ లో అయన ఏవైనా నిజాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నారు అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. మరి కేటీఆర్ చెప్పినట్లు నిజంగా 50 లక్షల కోట్ల సంపద సృష్టించి ఉంటే మొన్నటి ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ప్రజలు ఎందుకు తిరస్కరించినట్లు?. కెసిఆర్ కూడా ఇలాగే బంగారు తెలంగాణ, వజ్రపు తునక తెలంగాణ అంటూ ఎన్నో మాటలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్ ఏకంగా 50 లక్షల కోట్ల సంపద అని చెప్పి అందరూ విస్తు పోయాలా చేశారు అనే చెప్పాలి.

Next Story
Share it