Telugu Gateway
Telangana

కెసీఆర్ కేబినెట్ లో అవినీతి..వెల్ల‌డించిన ప్ర‌భుత్వవిప్

కెసీఆర్ కేబినెట్ లో అవినీతి..వెల్ల‌డించిన ప్ర‌భుత్వవిప్
X

తెలంగాణ సీఎం కెసీఆర్ ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా త‌మ‌ది క్లీన్ కేబినెట్ అంటూ చెబుతారు. మా ద‌గ్గ‌ర ఎవ‌రూ త‌ప్పుచేయ‌లేదు కాబ‌ట్టి వికెట్లు ప‌డ‌లేదంటారు. అంతే కాదు..తాము క‌డుపు క‌ట్టుకుని..నోరుక‌ట్టుకుని ప‌నిచేశామ‌ని చెబుతారు. అయితే ప్ర‌భుత్వ విప్ బాల్క సుమన్ మాత్రం తాజాగా సంచ‌ల‌న విష‌యాలు బ‌హిర్గతం చేశారు. ఈటెల రాజేంద‌ర్ ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు అవినీతికి పాల్ప‌డ్డార‌ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాల్క సుమ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు గ‌తంలో సీఎం కెసీఆర్ చెప్పిన దానికి భిన్నంగా ఉండ‌టం విశేషం. అంతే కాదు..ఈటెల రాజేంద‌ర్ పేద‌ల భూములు ఆక్ర‌మించుకున్నార‌ని..అసైన్ మెంట్ భూములు లాక్కున్నార‌ని మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు స్వ‌యంగా ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ మీడియా సాక్షిగా ఈటెల రాజేంద‌ర్ నిర్వ‌హించిన రెండు శాఖ‌ల్లో అవినీతికి పాల్ప‌డ్డార‌ని చెప్ప‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌రి ఆయ‌న అవినీతి తెలిసి కూడా ఎందుకు వ‌దిలేసిన‌ట్లు?. ఇప్పుడు ఈ విష‌యాన్ని ఎందుకు బ‌హిర్గ‌తం చేసిన‌ట్లు అన్న చ‌ర్చ సాగుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి ఆదేశిస్తే తాను గ‌జ్వేల్ లో సీఎం కెసీఆర్ పై పోటీచేసి..ఆయ‌న్ను ఓడిస్తాన‌ని ఈటెల రాజేంద‌ర్ ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ నేత‌లు మండిపడుతున్నారు. 2004కు ముందు ఈటెల అడ్ర‌స్ ఎక్క‌డ‌..? ఈటెల‌ను మంత్రి చేసింది కేసీఆర్ క‌దా? అని సుమ‌న్ ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాలరాజు, కేపీ వివేకానంద‌తో క‌లిసి విప్ బాల్క సుమ‌న్ టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడారు.ఈటెల రాజేందర్ మాటలను చూసి జనం నవ్వుకుంటున్నార‌ని సుమ‌న్ పేర్కొ మండిన్నారు. ఆయ‌న శిఖండి రాజ‌కీయాలు చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నిక‌ల్లో హుజురాబాద్‌లో రాజేంద‌ర్ ఓట‌మి ఖాయ‌మ‌న్నారు. అందుకే గ‌జ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నార‌ని విమ‌ర్శించారు. ఈటెల కేసీఆర్‌పై పోటీ చేసే సిపాయా? అని ప్ర‌శ్నించారు. ఆయ‌న ఓ చెల్ల‌ని రూపాయి అన్నారు. ప‌బ్లిసిటీ కోస‌మే ఈటెల ఈ తంటాలు ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. బీజేపీలో ఈటెల‌ది బానిస బ‌తుకు అని తెలిపారు.

Next Story
Share it