ధరణి పోర్టల్ రద్దు..ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ
కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాక్షిగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రకటించారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకటించే బాధ్యతను రాహుల్ గాంధీ తనకు అప్పగించారని చెబుతూ పలు కీలక అంశాలను ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అంటే పేగు బంధం, ఆత్మగౌరవం అన్నారు. అంతే కానీ ఇది ఎన్నికల నినాదం..ఓట్ల కోసం వాడే పదం కాదు అని వ్యాఖ్యానించారు. రాబోయేది సోనియా రాజ్యం అని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, ఇందిరమ్మ రైతు భరోసా కింద ఏటా పెట్టుబడి సాయం కింద 15000 వేల రూపాయలు అందిస్తామన్నారు. రైతు కూలీలకు కూడా ఏటా 12 వేల రూపాయలు ఇస్తామన్నారు.రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి..చివరి గింజ వరకూ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని తెలిపారు.
అంతే కాదు..తాము అధికారంలోకి వస్తే మూతపడిన చెరుకు కర్మాగారాలు తెరిపిస్తాం. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు బోర్డు విషయంలో బిజెపి, టీఆర్ఎస్ కలసి రైతులను మోసం చేశాయన్నారు. రైతులపై భారం లేకుండా మెరుగైన బీమా పథకం తెస్తాం, రైతుల పాలిట శాపంగా మారిన థరణి పోర్టల్ ను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అన్ని వర్గాల ప్రజల భూముల రక్షణ కల్పించేలా వ్యవస్థ ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడద ఉందని, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనకిలీ విత్తనాలు, పురుగుల మందుల నియంత్రణణకు కఠిన చట్టాన్ని తెస్తాం. వ్యక్తులు. సంస్థల మీద పీడియాక్ట్ కేసులు పెట్టి బొక్కలో వేస్తామన్నారు. భారత దేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేస్తున్నాం. రైతును రాజును చేయటమే మా లక్ష్యం.. అది రాహుల్ గాంధీతోనే సాధ్యం అని తెలిపారు.