Telugu Gateway
Telangana

ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నది ఇదే!

ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నది ఇదే!
X

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్న తరుణంలో జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అందరిలో ఎంతో ఉత్కంఠ రేపింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 11 న అంటే మంగళవారం నాడు పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఈ ఉప ఎన్నికకు సంబంధించి పలు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇందులో అన్నీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నే విజయం సాదించబోతున్నట్లు స్పష్టం చేశాయి. అధికార కాంగ్రెస్ ఎలాగైనా ఈ సీట్ దక్కించుకుని తమ ప్రభుత్వానికి ఢోకా లేదు అని చెప్పుకోవాలని గట్టి ప్రయత్నం చేయగా...ప్రతిపక్ష బిఆర్ఎస్ సిట్టింగ్ సీట్ నిలుపుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసింది.

ఎన్నిక ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కావటం...ఇందులో కూడా ప్రచారంలో ఉన్నట్లు అధికార కాంగ్రెస్ ఈ సీట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు చెపుతున్నారు. నవంబర్ 14 న అధికారికంగా కౌంటింగ్ జరగనుంది. అప్పుడే అసలైన ఫలితాలు వెల్లడి కావటంతో పాటు మెజారిటీ తదితర లెక్కలు బహిర్గతం కానున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక తో పాటు ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కి ఎంఐఎం మద్దతు ప్రకటించటం వంటి అంశాలు పార్టీ కి కలిసి వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ ను దక్కించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఇది కొంత బూస్ట్ ఇస్తుంది అనటంలో సందేహం లేదు. విచిత్రం ఏమిటి అంటే ఎన్నికల ముందు నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ ప్రతిపక్ష బిఆర్ఎస్ గెలుస్తుంది అని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే ఎన్నిక ముగిసిన వెంటనే ఇది అధికార కాంగ్రెస్ వైపు మారిపోయినట్లు చెపుతున్నారు.

Next Story
Share it