Telugu Gateway
Telangana

ఎర్ర‌వ‌ల్లిలో రైతుల‌తో కాంగ్రెస్ ర‌చ్చ‌బండ‌

ఎర్ర‌వ‌ల్లిలో రైతుల‌తో కాంగ్రెస్  ర‌చ్చ‌బండ‌
X

తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబ‌ర్ 27న ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఫాంహౌస్ కు కూత‌వేటు దూరంలో ర‌చ్చ‌బండ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ర‌చ్చ‌బండ‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు అంద‌రూ పాల్గొంటార‌న్నారు. రాష్ట్రంలోని రైతులు అంద‌రూ ర‌చ్చబండకు త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి శుక్ర‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం అత్యంత కీల‌కంగా మారిన రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌కుండా సీఎం కెసీఆర్ ఏమి చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇంత కంటే పెద్ద స‌మ‌స్య ఏమి ఉంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో రైతులు గత మూడు నెలలుగా హరిగోస పడుతున్నారని అన్నారు. కల్లాల్లో కుప్పలు, ఇంటి ముందు శవాలుగా రైతుల పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎందుకు కలవలేదు, రైతు సమస్య వివరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ గోడౌన్‌లోని 25వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోల్ మాల్‌పై కేంద్రం నిలదీస్తే దొంగళ్లలాగా పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. చావుడప్పులో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు.

ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారు. మంత్రుల బృందం ఏం తేల్చిందని నిలదీశారు. ఖరీఫ్ పంట టార్గెట్ పూర్తిగా ఎందుకు సరఫరా చేయలేదో రైతులకు, కేంద్రానికి కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఎంత సరఫరా చేస్తారో చెప్పకుండా అదనపు పంట కొంటామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యాసంగి పంట గురించి ఎందుకు నిలదీయడం లేదన్నారు. రైతులు చనిపోతుంటే కేటీఆర్, సంతోష్‌రావు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు రోజులుగా కేటీఆర్, సంతోష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.మంత్రుల బృందంలో కేటీఆర్, ఎంపీల బృందంలో సంతోష్‌రావు ఎందుకు లేరని ప్రశ్నించారు.ఖరీఫ్‌లో ఎంత కొంటారో చెప్పేవరకు, యాసంగి బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పేవరకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలన్నారు. ఏదీ తేలకుండా మంత్రుల బృందం వెనక్కి వస్తే ప్రజలు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వీధినాటకాలకు తెరలేపారని ధ్వజమెత్తారు.రైతులు ఎవరూ తొందరపడి చనిపోవద్దు, కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Next Story
Share it