హౌస్ కమిటీ కి అక్రమాలు చేసిన వాళ్ళ అనుమతి కావాలా?!

అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరసగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో సాగుతోంది. అయన ఈ మాటలు తెలిసి మాట్లాడుతున్నారో లేక తెలియక మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు అని ఆ పార్టీ నేతలు విస్తుపోతున్నారు. ఒక వైపు హరీష్ రావు కుటుంబ సభ్యులు అక్రమాలు చేశారు అని సభ సాక్షిగా ఆరోపిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన భూ దోపిడీపై హరీష్ రావు, కేటీఆర్, వెంకటరమణా రెడ్డి ఒకే అంటే ఈ అంశంపై హౌస్ కమిటీ వేస్తామని రేవంత్ రెడ్డి సభ సాక్షిగా ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే దొంగతనం చేసిన వాళ్ళను పట్టుకోవాలా వద్దా అన్న విషయంపై దొంగలనే అనుమతి కోరినట్లు ఉంది అని ఒక కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ర్ రెడ్డి దగ్గర అక్రమంగా భూ బదలాయింపుల విషయానికి సంబంధించి ఆధారాలు ఉంటే కమిటీ వేయటమో...లేదా వేరే మార్గంలో చర్యలు తీసుకోవాలి కానీ ప్రతిదానికి మీరు ఓకే అంటే వేస్తాం అనటం ఏమిటో అర్ధం కావటం లేదు పార్టీ నాయకులు విస్తుపోతున్నారు.
ఆదివారం నాడు అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్, హరీశ్ రావు ఇసుక మాఫియాతో రూ.వేల కోట్లకు అధిపతులుగా మారారని సీఎం విమర్శించారు. అలాగే పొంగులేటిని హరీశ్ రావు కుటుంబ సభ్యులు బెదిరించారని ఆరోపించారు. హరీశ్ రావు మామ, తమ్ముడు, బావమరిది పేరుపై భూ బదలాయింపు చేయనందుకే పొంగులేటిపై కక్షకట్టారని ఆరోపించారు. భూ దోపిడీపై హౌజ్ కమిటీకి సిద్ధమా అని సవాలు విసిరారు. హౌజ్ కమిటీకి హరీశ్ రావు, కేటీఆర్, వెంకటరమణారెడ్డి సిద్ధమంటే.. వెంటనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటై ఓట్లు, సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడిన కేసీఆర్, హరీశ్ రావును జైలు లో పెట్టిన తర్వాతే మాట్లాడాలని బీజేపీ నేతలకు సూచించారు.
కేసీఆర్, హరీశ్ రావుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై దర్యాప్తును ముందుకు సాగనివ్వడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ జరిగిందని గతంలో ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా చెప్పారని, ఆ అవినీతిపై విచారణ జరగాలని అన్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సీబీఐకి బదిలీ చేస్తే 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని కిషన్ రెడ్డి అన్నారని, వారి మాటలు నమ్మి కేసును సీబీఐకి అప్పగించామని, ఇప్పటి వరకు చర్యలు లేవని సీఎం విమర్శించారు. శాసనసభలో శనివారం నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి చెందిన కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ విషయాన్ని లేవనెత్తగా ఈ వ్యవహారం తో పాటు బిఆర్ఎస్ హయాంలో సాగిన అన్ని మైనింగ్ అక్రమాలు..ఇసుక అక్రమ మైనింగ్ పై విచారణ సీబీసీఐడీ తో విచారణ జరిపిస్తాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మీకు ఒక అంటే భూ అక్రమాలపై విచారణకు సభ సంఘం వేస్తామని చెప్పటంతో కాంగ్రెస్ నేతలు కూడా అవాక్కు అవుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ హయాంలో సాగిన భూ అక్రమ దందాలపై సభా సంఘాన్ని నియమించాలని పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు.



