Telugu Gateway
Telangana

తెలంగాణా రాజ్యసభ సీట్లు ఖరారు

తెలంగాణా రాజ్యసభ సీట్లు ఖరారు
X

తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్య సభ బరిలో ఉండే అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి మరో సారి రాజ్య సభకు అభిషేక్ మను సింఘ్వీ ని నామినేట్ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అయితే రెండవ అభ్యర్థి ఎవరు ఉంటారు అన్నదే కీలకంగా మారింది. కాంగ్రెస్ తరపున రెండవ అభ్యర్థిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు...ప్రస్తుతం సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో ఒక సీటును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మరో సీటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో పడినట్లు అయింది అనే చెప్పొచ్చు. రెండవ సీట్ కోసం చాలా మంది పోటీలో నిలిచారు. ఇందులో కూడా రకరకాల సామజిక సమీకరణ లెక్కలతో పలు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అన్నిటిని పక్కన పెట్టి కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి కి దగ్గర వ్యక్తి అయిన వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

గతంలో కాంగ్రెస్ అధిష్ఠానం..ముఖ్యంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య గ్యాప్ బాగా ఉంది అన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం అంతా బాగానే సెట్ అయినట్లు ఉంది అనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. ఈ కారణంగానే ఎంతో మంది రేస్ లో ఉన్నా కూడా వీళ్ళు అందరిని పక్కన పెట్టి వేం నరేందర్ రెడ్డి కి రాజ్య సభ ఛాన్స్ ఇచ్చినట్లు చెపుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కాంగ్రెస్ కు ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునే బలం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 66 మంది అయితే...సిపిఐ అభ్యర్థి ని కలుపుకుంటే ఈ బలం 67 మాత్రమే. అయితే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి దూకిన ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతానికి కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం వంటి పార్టీల మద్దతుతో కాంగ్రెస్ రెండవ సీటు ను దక్కించుకునే పనిలో ఉంది. అందుకే అధిష్టానం కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పేరుకే ఓకే చేసింది అనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. మార్చి 5 నామినేషన్స్ దాఖలుకు లాస్ట్ డేట్ కాగా..ఎన్ని అనివార్యం అయితే మార్చి 16 న పోలింగ్ నిర్వహిస్తారు.

Next Story
Share it