Telugu Gateway
Telangana

కాళేశ్వరం అంచనాల పెంపుపై విచారణే లేదంట!

కాళేశ్వరం అంచనాల పెంపుపై విచారణే లేదంట!
X

మరి రేవంత్ ..కాంగ్రెస్ నేతల ఆరోపణల మాట ఏంటి?

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇంత మోసమా?

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఉన్న ప్రధాన ఆరోపణే అంచనాల పెంపు. అడ్డగోలుగా అంచనాలు పెంచి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు..కాంగ్రెస్ కీలక నేతలు అందరూ ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఎన్ని సార్లు మాట్లాడారో లెక్కే లేదు. మేఘా ఇంజనీరింగ్ కు లబ్ది చేకూర్చటం కోసమే కెసిఆర్ అంచనాలు పెంచారు అని కూడా రేవంత్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్ పై అంచనాల పెంపు ప్రధాన ఆరోపణ కాగా..ఎన్నికల ముందే లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టి కట్టిన ఈ ప్రాజెక్ట్ డొల్లతనం బయటపడింది. ఇప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్ ఎంత మేర పనికి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది అని స్వయంగా రేవంత్ రెడ్డి చెపుతున్నారు. ఈ తరుణంలో ఆయన మంగళవారం నాడు ఢిల్లీ లో మీడియా తో నిర్వహించిన చిట్ చాట్ చేసిన వ్యాఖ్యలు అటు అధికారులతో పాటు రాజకీయ వర్గాలను కూడా షాక్ కు గురి చేసేలా ఉన్నాయని చెప్పొచ్చు. రేవంత్ ఢిల్లీలో మాట్లాడిన మాటలు ఇవి.పత్రికల్లో ప్రధానంగా వచ్చినవి.... ‘కాళేశ్వరం పై న్యాయ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకే పరిమితం. ప్రాజెక్ట్ నిర్మాణ అంచనాలను గత సర్కారు పెంచిన తీరుపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నిర్మాణం ముందుకు సాగదు.

విచారణకు ఆదేశిస్తే పెండింగ్ ప్రాజెక్ట్ ల పనులు చేయించలేం. బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది’ అని చెప్పినట్లు వచ్చింది. ఇవే నిజం అయితే ఇంతకంటే దారుణం, మోసం మరొకటి ఉండదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. కాగ్ నివేదికలో కూడా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కి వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ది కలిగించినట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు వాటి అన్నిటిని పక్కన పెట్టి...ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేసిన విమర్శలు అన్ని మర్చిపోయి అంచనాల పెంపుపై విచారణ లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అంటే దీనివెనుక ఏదో పెద్ద కథ నడిచింది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణ అంతా కూడా అక్రమాలకు పాల్పడినవారు చెప్పినట్లే జరుగుతుంది అని మరో సీనియర్ అధికారి వెల్లడించారు. దీని కోసం ఒక కీలక పత్రికాధిపతి కూడా రంగంలోకి దిగినట్లు చెపుతున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వేదికగా కాళేశ్వరం తో పాటు అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా అంచనాలు పెంచి అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు.

లక్ష కోట్ల రూపాయల పైన తెలంగాణ ప్రజల డబ్బును ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాల పెంపుపైనే విచారణ ఉండదు అని రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఇక ఇతర విషయాలు పట్టించుకుంటారు అని ఎవరైనా నమ్ముతారా అనే చర్చ కూడా సాగుతుంది. పైగా ఇంత ఖర్చుపెట్టిన ప్రాజెక్ట్ పోనీ తెలంగాణ రైతులకు ఏమైనా సరిగా ఉపయోగపడుతుందా అంటే అది లేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి గాడిన పెట్టాలంటే ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది ఎవరికీ తెలియదు. మొత్తానికి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే సీఎం రేవంత్ రెడ్డి ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవటం ద్వారా తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చారు అనే చెప్పాలి. రేవంత్ రెడ్డి చెపుతున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాల పెంపుపై విచారణకు ఆదేశిస్తే ఏ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా ముందుకు సాగదు అని చెప్పటం విచిత్రంగా ఉంది అనే చెప్పాలి. అంటే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ సర్కారు చేసిన అన్ని అక్రమాలకు రేవంత్ రెడ్డి తన మాటల ద్వారా ఆమోద ముద్ర వేసినట్లు అయింది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

Next Story
Share it