Telugu Gateway
Telangana

గాంధీ ఆస్పత్రిలో కెసీఆర్

గాంధీ ఆస్పత్రిలో కెసీఆర్
X

సిబ్బంది సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ

ముఖ్యమంత్రి కెసీఆర్ సీఎం అయిన తర్వాత తొలిసారి గాంధీ ఆస్పత్రిలోకి అడుగుపెట్టారు. అది కూడా కరోనా బాధితులను పరామర్శించేందుకు. బుధవారం నాడు కెసీఆర్ మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులతో కలసి ఈ పర్యటన చేశారు. ఈటల రాజేందర్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత కెసీఆర్ స్వయంగా ఈ శాఖను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం గాంధీ కి చేరుకున్న సిఎం కెసిఆర్ గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసియు, ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్ వార్డులు సహా, పలు జనరల్ వార్డులలో సిఎం కెసిఆర్ కలియతిరిగారు. బెడ్స్ వద్దకు పోయి అందరి పేషెంట్ల తో మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి దైర్యం చెప్పారు.

ఆస్పత్రిలో చికిత్స సరిగ్గా అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. భోజనం ఎలా ఉందని అడిగారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా వైద్యాధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు కదిలారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సీజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పరిశీలించారు. నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సీజన్ ను తయారు చేసే ఆక్సీజన్ ప్లాంట్ ను ఇటీవలే గాంధీలో సిఎం ఆదేశాలమేరకు నెలకొల్పారు. ప్లాంట్ మొత్తం కలియతిరిగి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ను ప్లాంటు పనిచేసే విధానం గురించి, ఆక్సీజన్ ప్యూరిటీ గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో సిఎం కెసిఆర్ స్వయంగా మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. వారికి ఎటువంటి ఇబ్బంది వున్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లుగా వారి మీద వున్నదని సిఎం అన్నారు. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్య అధికారులను సిఎం ఆదేశించారు. ' క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు. ఈ సేవలను కొనసాగించండి. మీకు ఏ సమస్యవున్నా, అవసరం వున్నా నన్ను సంప్రదించండి. నేను సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తాను..'' అని సిఎం కెసిఆర్ వారికి భరోసానిచ్చారు.

Next Story
Share it