Top
Telugu Gateway

కరోనా నియంత్రణపై కేంద్ర మంత్రికి కెసీఆర్ సూచనలు

కరోనా నియంత్రణపై కేంద్ర మంత్రికి కెసీఆర్ సూచనలు
X

మూడు నెలల కాలానికి తాత్కాలిక డాక్టర్లు..నర్సుల నియామకం

వరంగల్, ఆదిలాబాద్ ల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదివారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకోవటంతోపాటు..పలు సమస్యలపై సీఎం కెసీఆర్ ఫోన్ లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో చర్చించినట్లు సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కరోనాను నియంత్రించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యలగురించి సిఎం కెసీఆర్ కేంద్ర మంత్రికి కొన్ని విలువైన సూచనలు చేశారన్నారు. కరోనా వ్యాప్తి ని పెంచే అవకాశం వున్న 'అతివేగంగా వ్యాప్తి కారకులను' గుర్తించి వారికి ముందువరసలో టీకాలు వేస్తే బాగుంటుందని సూచించారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు గ్యాస్ ను సరఫరా చేసే బాయ్స్, స్ట్రీట్ వెండార్స్, ఇంకా పలు దిక్కులకు పోయి పనిచేసే కార్మికులు తదితరులను కరోనా వ్యాప్తి అధికం చేసే అవకాశాలున్న వారిగా ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వాక్సిన్ ను అందచేసేందుకు నిబంధనలను సడలించాలన్నారు. ఆ వెసులుబాటు ను రాష్ట్రాలకు కల్పించడం ద్వారా కరోనా వ్యాప్తిని అధికభాగం అరికట్టే అవకాశాముంటుందని సిఎం తెలిపారు. సిఎం సూచనలమీద సానుకూలంగా స్పందించిన కేంద్రం మంత్రి ప్రధానితో చర్చించి ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారన్నారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సిఎం కెసిఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. వీరికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సిఎం ఆదేశించారు. కష్టకాలంలో ప్రజలకోసం సేవచేయడానికి ముందుకు రావాలని యువ డాక్టర్లకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఆసక్తి వున్నవాల్లు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సిఎం తెలిపారు. https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx.. డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని సిఎం పిలుపునిచ్చారు.

వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎం జి ఎం కు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్ జిల్లా రిమ్స్' లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పి ఎం ఎస్ ఎస్ వై కింద ఎంజిఎం లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటాకింద తక్షణం అందచేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్ లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ప్రభుత్వ వాటాకింద 20 కోట్ల రూపాయలను, మొత్తం 28 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. అదే సందర్భంలో వరంగల్ దవాఖానా కోసం 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్యసిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సిఎం ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలలో మెత్తం 7393 బెడ్లు అందుబాటులో వున్నాయని, 2470 ఆక్సీజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్దంగా వున్నాయని తెలిపారు. మందులతో పాటు, వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో వున్నాయన్నారు. కాగా ప్రయివేటు దవాఖానాల్లో రెమిడిసివర్ ఇంజక్షన్ల ను మరింతగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లను చేయాని సిఎం సూచించారు.

Next Story
Share it