ప్రధాని మోడీ పర్యటనకు కెసీఆర్ దూరం!
తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాటలోనే పయనించనున్నారా?. తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే కన్పిస్తున్నాయి. ఇటీవల రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం కెసీఆర్ దూరంగా ఉన్నారు. సంప్రదాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంటుంది. కానీ కెసీఆర్ అందుకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ పై స్పందన తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం కెసీఆర్ గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రధాని నరేంద్రమోడీ..కేంద్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని పాలకులకు మెదడులేదని..మోడీది కురచబుద్ధి అని..మోడీకి చెప్పినా..గోడకు చెప్పినా ఒకటే అంటూ మండిపడ్డారు. అన్నింటి కంటే అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ శనివారం నాడు హైదరాబాద్ వస్తున్నారు. ఒకటి ఇక్రిశాట్ కార్యక్రమం అయితే..మరొకటి ముచ్చింతాల్ లో రామానుజుడి విగ్రహావిష్కరణ ఒకటి. సహజంగా ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే ప్రొటోకాల్, సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు. అయితే ఈ సారి మాత్రం గతానికి భిన్నంగా ప్రధాని మోడీకి స్వాగతం పలకటంతోపాటు..వీడ్కోలుపలికే బాధ్యతను తెలంగాణ సర్కారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు అప్పగించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కూడా వ్యూహాత్మకంగా బయట పెట్టింది. సహజంగా ఇవి అంతర్గత విషయాలుగా ఉంచుతారు. అయితే ప్రధాని మోడీ స్వాగతానికి సీఎం కెసీఆర్ వెళ్ళటం లేదనే సంకేతాలను పంపటానికి ఈ లేఖను బయటకు విడుదల చేశారు.
గురువారం నాడు ముచ్చింతాల్ వెళ్ళిన కెసీఆర్ అక్కడ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రధాని మోడీ పర్యటనలో ప్రొటోకాల్ ప్రకారమే చేస్తానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు బాధ్యతలు అప్పగించటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఎన్నడూలేని రీతిలో గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ లు కేంద్రంలోని మోడీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మంత్రి కెటీఆర్ అయితే ట్విట్టర్ లోనూ గతంలో మోడీ చేసిన ప్రకటనలకు సంబంధించిన క్లిప్పింగులను కూడా ట్వీట్ చేస్తూ బిజెపిపై ఎటాక్ పెంచారు. అయితే సీఎం కెసీఆర్ కేవలం ప్రధాని మోడీ స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలకే దూరంగా ఉంటారా? లేక ముచ్చింతాల కార్యక్రమానికి దూరంగా ఉంటారా అన్నది వేచిచూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చినజీయర్ కు, కెసీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే స్వాగత, వీడ్కోలుకు దూరంగా ఉండే సీఎం రామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా దూరంగా ఉండే అవకాశాలే ఉన్నాయంటున్నారు.