Telugu Gateway
Telangana

ఎన్టీఆర్, రాజ‌మౌళికి కెసీఆర్ షాక్?!

ఎన్టీఆర్, రాజ‌మౌళికి కెసీఆర్ షాక్?!
X

సినిమా ప‌రిశ్ర‌మ‌లోని వాళ్లు సినిమాల వ‌ర‌కూ వాళ్ల ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేసుకున్నంత కాలం రాజ‌కీయ నాయ‌కుల‌కు పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌దు. పైగా ఫుల్ స‌పోర్ట్ కూడా చేస్తారు. కానీ సినిమాల్లో ఉండి రాజ‌కీయాల జోలికి వ‌స్తే మాత్రం తేడా వ‌స్తుంది. కొంత మంది చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేస్తారు. కానీ ఇక్క‌డ ఉన్న‌ది కెసీఆర్. ఆయ‌న‌కు న‌చ్చ‌క‌పోతే ఏ మాత్రం మెహ‌మాటాలు ఉండ‌వు. ఇప్పుడు అదే జ‌రిగిందనే చ‌ర్చ సాగుతోంది. తెలంగాణ‌లో ఇప్పుడు టీఆర్ఎస్. బిజెపికి మ‌ధ్య రాజ‌కీయ వార్ పీక్ కు చేరింది. కొద్ది రోజుల క్రితం మునుగోడు బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. రాజ‌కీయంగా ఇది పెద్ద దుమార‌మే రేపింది. ఈ భేటీపై అటు అమిత్ షా కానీ..ఇటు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రూ ఎక్క‌డా స్పందించ‌లేదు. కానీ రాజ‌కీయంగా ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రిగింది. ఇది ఎంత వ‌ర‌కూ వెళ్లింది అంటే ఎన్టీఆర్ బిజెపి త‌ర‌పున ప్రచారం చేస్తారు అనేంత వ‌ర‌కూ కూడా సాగింది. వెళ్లింది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితోపాటు ప‌లువురు నేతలు సినిమాల గురించి మాత్ర‌మే అమిత్ షా, ఎన్టీఆర్ భేటీలో చ‌ర్చ జ‌రిగింద‌ని చెప్పినా..దీన్ని ఎవ‌రూ పెద్దగా న‌మ్మ‌లేదు. ఇప్పుడు తాజాగా బ్ర‌హ్మ‌స్త్ర సినిమా ద్వారా ఝ‌ల‌క్ ఇచ్చార‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌రు అవుతార‌ని కొద్ది రోజుల ముందే ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా భారీ ఎత్తున ఈ కార్య‌క్ర‌మం జ‌రిగే రామోజీ ఫిల్మ్ సిటీ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు.

అయితే నిజంగా అనుమ‌తి ఇవ్వ‌ద‌ల‌చుకోక‌పోతే ముంద‌స్తు స‌మాచారం ఇస్తే ఎక్క‌డి వారు అక్క‌డ ఆగిపోయే వారు. కానీ ఈ సినిమాలో అమితాబ‌చ్చ‌న్, రణ‌బీర్ క‌పూర్, అలియాభ‌ట్, నాగార్జున త‌దిత‌రులు న‌టించారు. చిత్ర యూనిట్ హైద‌ర‌బాద్ చేరుకుంది. కానీ చివ‌రి నిమిషంలో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను కార‌ణంగా చూపుతూ ఈవెంట్ కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. అయితే దీని వెన‌క ఉత్స‌వాల కార‌ణం కంటే రాజ‌కీయ కార‌ణాలే ఉన్న‌ట్లు టాలీవుడ్ లో చ‌ర్చ సాగుతోంది. మునావ‌ర్ ఫారుఖీ ఈవెంట్ ను వేల మంది పోలీసుల ప‌హారాలో నిర్వ‌హించిన స‌ర్కారు..ఫిల్మ్ సిటీలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి అనుమ‌తి నిరాక‌రించ‌టం అంటే ఖ‌చ్చితంగా రాజ‌కీయ కోణంలో ఇది సాగింద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. తెలుగులో ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ను ముఖ్య‌అతిధిగా అహ్వానించారు. చివ‌రి నిమిషంలో ఈవెంట్ ర‌ద్దు కావ‌టంతో చిత్ర యూనిట్ కు షాక్ తగిలిన‌ట్లు అయింది. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కు బిజెపి ప్ర‌భుత్వం కొద్ది రోజుల క్రిత‌మే నామినేటెడ్ కోటాలో రాజ్య‌స‌భ సీటు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అంతే కాదు..ఆయ‌న ఆర్ఎస్ఎస్ కోసం ఓ సినిమా క‌థ‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇవి అన్నీ సీఎం కెసీఆర్ కోపానికి కార‌ణం అయి ఉంటాయ‌ని భావిస్తున్నారు.

Next Story
Share it