రిబ్బన్ కటింగ్ కు కత్తెర మర్చారు...కెసీఆర్ ఫైర్!
ప్రారంభోత్సవం అంటే రిబ్బన్ కటింగ్ కామన్. ముఖ్యంగా రాజకీయ నేతలు చేసే ప్రారంభోత్సవాల్లో ఇది సామాన్యంగా జరిగే వ్యవహారం. కానీ ముఖ్యమంత్రి కెసీఆర్ కార్యక్రమంలోనే అధికారులు కత్తెర మర్చిపోయారు. ఈ వ్యవహారం ఒక్కసారి కలకలం రేగింది. చివరకు సీఎం కెసీఆర్ కు చిర్రెత్తుకొచ్చింది. ఆ కొత్త ఇంటికి కట్టిన రిబ్బన్ ను చేత్తోనే పీకిపడేశారు..లోపలికి ఎంట్రీ ఇచ్చారు. కెసీఆర్ ఆదివారం నాడు సిరిసిల్ల జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల కెసీఆర్ తనయుడు, మంత్రి కెటీఆర్ నియోజకవర్గం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన, గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి... ఓ ఇంటి గృహ ప్రవేశానికి రెడీ అయ్యారు.
వేదమంత్రాల మధ్య దంపతులతో సహా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే రిబ్బన్ కట్ చేద్దామనుకునే సమయంలో కత్తెర అందుబాటులో లేకుండా పోయింది. అందరూ కత్తెర... కత్తెర.. అంటూ అటూ ఇటూ చూడ్డం మొదలు పెట్టారు. దీంతో కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తనే చేత్తే రిబ్బన్‌ను పీకి పడేశారు. అనంతరం దంపతులతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ పరిణామంతో అధికారులు అవాక్కు అయ్యారు. మరి సీఎం కార్యక్రమానికి కత్తెర మర్చివచ్చిన అధికారుల పరిస్థితి ఏంటో.