Telugu Gateway
Telangana

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కెసీఆర్ 'ఉచిత హామీలు'

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కెసీఆర్ ఉచిత హామీలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 'ఉచిత హామీలు' ప్రకటించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా ఈ హామీలు ఇఛ్చినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఓ వైపు కరోనాతో రాష్ట్ర ఆర్ధిక స్థితి కుదేలు అయిపోయిందని కొన్ని నెలల పాటు వేతనాల్లో కూడా కోతలు విధించిన సర్కారు ఇప్పుడు ఖజానాపై భారంపడేలా పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ డిసెంబర్ నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని పది లక్షల గృహవినియోగ నల్లా కనెక్షన్లలో 20 వేల లీటర్ల లోపు నీళ్ళు వినియోగించే గృహవినియోగదారులకు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నెలకు 20 వేల లీటర్ల వరకూ ప్రభుత్వమే ఉచితంగా నీటిని సరఫరా చేస్తుంది. తర్వాత ఈ పథకాన్ని ఇతర మున్సిపాలిటీలకు కూడా విస్తరిస్తాం. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంగా ఉన్న క్షౌరశాలలకు ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేయనుందని ప్రకటించారు. నాయి బ్రాహ్ముణులు చాలా కాలం నుంచి కోరుతున్న ఈ కోరికను వచ్చే డిసెంబర్ నుంచి అమలు చేయబోతున్నాం.

దీంతోపాటు లాండ్రీలు, దోబీఘాట్ లకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. డిసెంబర్ నుంచి జీహెచ్ఎంసీ తోపాటు రాష్ట్రంలోని అన్ని దోబీ ఘాట్లకు , లాండ్రీలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయటంతోపాటు దెబ్బతిన్న దోబీఘాట్లను పునరుద్ధరిస్తామన్నారు. కరోనా కాలానికి మోటారు వాహన పన్ను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీని వల్ల వాహనదారులకు 267 కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. పరిశ్రమలు, థియేటర్లు, వ్యాపార సంస్థలకు హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీలకు కనీస డిమాండ్‌ ఛార్జీలు మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. రూ.10 కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ చేస్తామన్నారు. దీంతోపాటు మూసీతో గోదావరి అనుసంధానం చేస్తామని ప్రకటించారు. బాపుఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు మూసీ నది మధ్యలో బోటింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

Next Story
Share it