Telugu Gateway
Telangana

ఇది గోల్ మాల్ బ‌డ్జెట్

ఇది గోల్ మాల్ బ‌డ్జెట్
X

కేంద్ర బ‌డ్జెట్ పై సీఎం కెసీఆర్ మండిప‌డ్డారు. ఈ బడ్జెట్...దశ దిశా నిర్దేశం లేని., పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనం తో నిండి, మాటలగారడీ తో కూడుకున్న‌ద‌ని విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ , మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ను సిఎం పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సిఎం అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ను బిగ్ జీరో అని సిఎం స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్ కం టాక్స్ లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సిఎం అన్నారు.

ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని , వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీల్లు చల్లిందన్నారు. వైద్యం తదితర ప్రజోరోగ్యం , మౌలిక రంగాలను అభివృద్ధి పరడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు. '' ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తుంటే..ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమ''ని సిఎం అన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని సిఎం ఆశ్యర్యం వ్యక్తం చేశారు. బ‌డ్జెట్ పై సాయంత్రం సీఎం కెసీఆర్ బ‌డ్జెట్ పై స్పందించేందుకు మీడియా ముందుకు రానున్నారు.

Next Story
Share it