Telugu Gateway
Telangana

ఖండనకూ కెసిఆర్ కు ఇంత సమయమా?!

ఖండనకూ కెసిఆర్ కు ఇంత సమయమా?!
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి మృతి పై ఇప్పటివరకు ముఖ్యమంత్రి కెసిఆర్ అసలు స్పందించలేదు. మంత్రులు మాట్లాడారు కానీ...సీఎం మాత్రం ఇంత వరకు ఈ అంశంపై నోరు తెరవలేదు. ప్రీతీ తనకు ఎదురవుతున్న సమస్యలు..ఇబ్బందుల గురించి ఫిర్యాదు చేసినా కూడా కాలేజీ అధికారులు సరైన రీతిలో స్పందించలేదనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. తొలుత వైద్య శాఖ అధికారులు అసలు పీ జీ లో ర్యాగింగ్ ఉండదు అని తేల్చారు. తర్వాత పోలీస్ ఉన్నతాధికారులు ర్యాగింగ్ జరిగింది అని ఆధారాలు గుర్తించారు. కులం పేరుతో కూడా ...రకరకాలుగా ప్రీతిని ఇబ్బంది పెట్టినట్లు ఆమె తల్లి తండ్రులు కూడా పలు మార్లు చెప్పారు. ఇందులో ప్రభుత్వ పరంగా వైఫల్యాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా సీఎం కెసిఆర్ మాత్రం ఎక్కడా దీనిపై నోరు తెరవలేదు. విచిత్రం ఏమిటి అంటే సీఎం కెసిఆర్ సోమవారం సాయంత్రం ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పై స్పందించారు. అయితే ఈ స్పందనకు దగ్గర దగ్గర 24 గంటల సమయం తీసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

‘ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అదానికి ప్రధాని మోడీ కి నడుమనున్న అనుబంధాన్నించి ప్రజల దృష్టిని మల్లించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదు’ అంటూ కెసిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత కవిత అరెస్ట్ ఉంటుంది అని ప్రచారం జరుగుతున్న సమయంలో కెసిఆర్ ఈ ప్రకటన ఇవ్వటం కూడా చర్చనీయాంశగా మారింది. మరి ఇదే ట్విట్టర్ ద్వారా అయినా సీఎం కెసిఆర్ ప్రీతి విషయంలో కూడా స్పందించే ఉంటే సముచితంగా ఉండేదని ఒక అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it