Telugu Gateway
Telangana

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కోసం 120 కోట్లు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కోసం 120 కోట్లు
X

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన రెండు నెలల జీతాలను తక్షణమే చెల్లించేలా ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం 120 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో హైదరాబాద్ లో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సిఎం నిర్ణయించారు. ఆదివారం ప్రగతి భవన్ లో ఆర్టీసి పైన సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినా వెనకడుగువేయకుండా ఆర్టీసి ని తిరిగి బతికించుకుంటామని సీఎం కెసీఆర్ తెలిపారు. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం,ఎల్ ఐ సి సహా, ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేటు పరం చేసుకుంటూ వస్తున్నది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కు పోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటుంది. అందులో భాగంగా ఆర్టీసీ సంస్థను బతికించుకోని తిరిగి గాడిన పెట్టేదాక నేను నిద్రపోను. నేనుంత కాలం ఆర్టీసీని బతికించుకుంట. ఆర్టీసీ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కటుంబాలు పెద్ద సంఖ్యలో వున్నాయి. దాంతో పాటు పేదలకు ఆర్టీసీ అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ. ఈ కారణాల చేత ప్రభుత్వం లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసిని కాపాడుకోవాలనుకుంటున్నది.

ప్రభుత్వం ఆర్టీసి కి ఆర్ధికంగా అండగా నిలుస్తుంది. ఆర్టీసి కార్మికులకు ఇప్పటికే పెండింగులో వున్న రెండు నెల్ల జీతాలను తక్షణమే చెల్లించాలి .అందుకు తక్షణమే ఆర్ధికశాఖ 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలి..'' అని సిఎం స్పష్టం చేశారు. కరోనా భయంతో కొంత, వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగిపోయిన కారణం చేత, కొన్ని నెలలుగా ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోయిందని తద్వారా ఆర్టీసీ తిరిగి నష్టాల బాటపట్టిందని అధికారులు సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ కు వివరించారు. కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్టీసీకి తిరిగి కోరోనా ముందటి పరిస్థితిని తీసుకురాగలమో అధికారులు విశ్లేషించుకోవాలని సిఎం ఆదేశించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని ఈ సందర్బంగా సిఎం తెలిపారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవల తో లాభాలను గడిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story
Share it