తెలంగాణలో 1.31 లక్షల ఉద్యోగాలిచ్చాం..మరో 50 వేలు ఇస్తాం
ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1.31 లక్షల ఉద్యోగాలిచ్చామని.. నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో యాభై వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ ప్రారంభమైందని సిఎం కెసీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామన్నారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం" (world youth skills day) సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గ్రామీణ, పట్టణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేళ్లుగా అమలు పరుస్తున్న ప్రభుత్వ కార్యాచరణ కొలిక్కివచ్చిందన్నారు. సంపదను సృష్టించి దాన్ని ప్రజలకు పంచడం అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పునర్నిర్మితమైన తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలను యువతీ యువకులు అనుభవించే పరిస్థితులు నేడు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నాయని సిఎం అన్నారు.
పట్టణాల్లో ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలను అమలు చేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. పరిశ్రమలు ఐటి రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని సిఎం అన్నారు. తెలంగాణలో పారిశ్రామిక, వాణిజ్యం,ఐటి రంగాలు సహా వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నయని, ఈ నేపథ్యంలో లక్షలాదిగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరగుతుందన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని సిఎం తెలిపారు. మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సిఎం తెలిపారు.
తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైందని వారికి నైపుణ్యాలు తోడయితే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుందని సిఎం పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని తెలిపారు. ఐటి సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ నైపుణ్య పరిజ్జాన అకాడెమీ (టాస్క్)ని దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసామన్నారు. తద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామన్నారు.