ఎన్నికల కోసమే మహా మెట్రో ప్రకటన

ఇప్పుడు కొత్తగా తలపెట్టిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో పూర్తి కే మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ డబ్బులతో కడుతున్న ప్రాజెక్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ అమలుకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్నదే పెద్ద సందేహం. ఈ నెలలో శంషాబాద్ ప్రాజెక్ట్ బిడ్దర్ ఫైనలైజ్ అవుతుంది...పనులు అప్పగిస్తారు. వచ్చే నెలలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి అయి...కొత్త ప్రభుత్వం కొలువుతీరాక కానీ ఈ పనులు ముందుకు సాగే అవకాశం లేదు. అలాంటిది సోమవారం నాటి క్యాబినెట్ లో ఏకంగా 70 వేల కోట్ల రూపాయలతో కొత్తగా 278 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ మార్గాల అభివృద్ధి, నగరం నాలు వైపులా అంటూ ప్రకటన వెలువడింది. అసలు ఈ మహా మెట్రో ప్రతిపాదన కాగితాలకు పరిమితం అవటం తప్ప ఏమీ ఉండదు అనే అభిప్రాయం అధికారుల్లో కూడా ఉంది. సీఎం కెసిఆర్ టెండర్లు ఖరారు కాకుండానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందటానికి ఈ ప్రకటన చేశారనే చర్చ సాగుతోంది. మరి సీఎం కెసిఆర్ ప్రయతనాలు ఫలిస్తాయా లేదా అన్నది తేలాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.