Telugu Gateway
Telangana

కెసిఆర్ ఓ ఫెయిల్యూర్ ఇంజనీర్ గా మిగిలి పోయారా?

కెసిఆర్ ఓ ఫెయిల్యూర్ ఇంజనీర్ గా మిగిలి పోయారా?
X

కెసిఆర్ ఓ ఫెయిల్యూర్ ఇంజనీర్ గా మిగిలి పోయారా?

మేడిగడ్డ పై మసిపూసి మారేడుకాయ

డిజైన్ ప్రభుత్వానిది అయితే ఎల్ అండ్ టి బాధ్యత తీసుకుంటుందా?!

తప్పు కంపెనీ ది అయితే బ్లాక్ లిస్ట్ లో పెడతారా...పనులు చేస్తే చాలు అంటారా?

కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి మొదటి నుంచి ప్రజల్లో అనుమానాలు పెంచేదిగా ఉందే తప్ప..ఎప్పుడూ అనుమానాలు నివృత్తి చేసేలా వ్యవహరించ లేదు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కూడా అదే తీరు. సాగునీటి శాఖ బాధ్యతలు చూస్తున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తో పాటు ఈ ఎన్ సి లు కూడా ఇసుక కదలటం వల్ల పిల్లర్లు కుంగాయి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంత్రి కెటిఆర్ కూడా నిర్మాణ సంస్థే మేడిగడ్డలో దెబ్బ తిన్న పనులు చేస్తుంది అని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని ఇంజినీరింగ్ నిపుణులు చెపుతున్నారు. వాస్తవానికి ఈపీసి కాంట్రాక్టుల్లో అయితే నిర్మాణ సంస్థే డిజైన్ తో పాటు అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది. కానీ మేడిగడ్డ విషయంలో అయితే ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి ) సంస్థ పనులు చేపట్టింది. ఎల్ అండ్ టి చేసిన పనులు అన్నీ సరిగా ఉన్నాయని సర్టిఫై చేసి...బిల్స్ చెల్లించి ..ఓకే చేసింది తెలంగాణ ప్రభుత్వమే. మరి అలాంటప్పుడు ఎల్ అండ్ టి ఎందుకు ఇప్పుడు రిపేర్లకు అయ్యే ఖర్చు భరిస్తుంది. నిజంగా తప్పు ఎల్ అండ్ టి ది అయితే ఆ కంపెనీ ని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి కానీ...సొంత డబ్బులతో రిపేర్లు చేస్తుంది అని చెప్పి వదిలేస్తారా?. ప్రతి పనికి అంటే రోడ్లు అయినా...ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు అయినా ప్రతి దాంట్లో ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఏవైనా సమస్యలు వస్తే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అనే క్లాజ్ ఉంటుంది.

అంటే కొన్ని సంవత్సరాల పాటు లోపాలకు బాధ్యత తీసుకోవటం అన్న మాట. అది కూడా వేటికి వర్తిస్తుంది అన్నది ఒప్పందంలో స్పష్టంగా ఉంటుంది. కానీ మేడిగడ్డ విషయానికి వస్తే డిజైన్ల లోపం కారణంగానే పిల్లర్లు కుంగిపోయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు చెపుతున్నారు. ఎల్ అండ్ టి ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం పని చేసింది. ఈ లెక్కన నిర్మాణ సంస్థ సొంత డబ్బుతో పనులు చేస్తుంది అని మంత్రి కేటీఆర్, ఇంజినీర్లు చెప్పే మాటలు ఏ మాత్రం నిజం కాదు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఈ సమస్య నుంచి తప్పించుకోవటానికి ఇలా చెపుతున్నారు అని ఇంజనీర్లు చెపుతున్న మాట. ఇంజినీర్లకే ఇంజనీర్ అని చెప్పుకున్న సీఎం కెసిఆర్ ప్రాజెక్ట్ ల రీ డిజైనింగ్ అంతా తానే చేసినట్లు చెప్పుకున్నారు.. బ్యారేజ్ కట్టే ప్రాంతంలో వైబ్రేషన్స్, ఫౌండేషన్ స్ట్రెంత్ వంటి అంశాలపై చేయాల్సిన దానికంటే తక్కువ కాలంలోనే పరీక్షలు చేసి పని పూర్తి చేశారు అని...ఇప్పుడు ఆ ఫలితమే మేడిగడ్డ బ్యారేజిలో కనిపిస్తోంది అని చెపుతున్నారు. తాము ప్రజలకే జవాబుదారీ చెప్పుకుంటూ ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెపాల్సిన అవసరం లేదంటారు...సమాచార హక్కు చట్టం కింద కూడా సమాచారం ఇవ్వరు. అయినా సరే తమ అంతా ప్రజాస్వామిక పాలన దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించటం బిఆర్ఎస్ నేతలకే చెల్లుతుంది. మరో కీలక విషయం ఏమిటి అంటే మేడిగడ్డ పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి కూడా రాష్ట్ర అధికారులు అడిగిన సమాచారం ఇవ్వటం లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

Next Story
Share it