Telugu Gateway
Telangana

అదే ఇప్పుడు దెబ్బతీయబోతుందా?!

అదే ఇప్పుడు దెబ్బతీయబోతుందా?!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ కు గడ్డు కాలం ఎదురుకాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెపుతున్నాయి. ఎక్కువ మంది విశ్వసించే ఇండియా టుడే-యాక్సిస్ మై ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ తో అధికారంలోకి రాబోతున్నట్లు అంచనాలు వెల్లడించింది. ఇవన్నీ అధికార బిఆర్ఎస్ నేతల్లో టెన్షన్ ను మరింత పెంచుతున్నాయి. ఎక్కువ మంది నేతలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితుల ఆధారంగా స్పష్టత కూడా వచ్చేసింది. అయినా అంతిమం అసలు ఫలితాలే కాబట్టి ఆదివారం మధ్యాహ్నం వరకూ ఈ టెన్షన్ తప్పదు. కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ట్రాష్ అని చెపుతూ..తమకు 70 సీట్లు గ్యారంటీగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంటే...మరో వైపు సీఎం కెసిఆర్ డిసెంబర్ నాలుగున సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది చూసిన చాలా మంది ఆశ్చర్యానికి గురి అవుతున్నారనే చెప్పొచ్చు. అయితే అటు కేటీఆర్ ధీమా అయినా..ఇటు కెసిఆర్ క్యాబినెట్ సమావేశం ప్రకటన అయినా కూడా కౌంటింగ్ కేంద్రాల్లో బిఆర్ఎస్ ఏజెంట్లు ఎగ్జిట్ పోల్స్ ప్రభావంలో పడి ముందే చేతులు ఎత్తేయకుండా ఉండేందుకు...వారిలో నమ్మకాన్ని నింపేందుకు చేస్తున్న ఎత్తుగడలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కూడా బిఆర్ఎస్ నేతల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం బిఆర్ఎస్ ఈ పరిస్థితి ఎదుర్కోవటానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ నో చెప్పటమే ప్రధాన కారణం అనే అభిప్రాయాన్ని కూడా ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.

అదేంటి అంటే ఈ ఎన్నికల్లో కనీసం 35 నుంచి 40 మంది వరకు సిట్టింగ్ అభ్యర్థులను మార్చాలని..లేకపోతే ఇబ్బందులు తప్పవని కెసిఆర్ కు కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారని..అయితే అభ్యర్థుల మార్పుకు కెసిఆర్ నో చెప్పటం వల్లే ఇప్పుడు ఎదురీదాల్సి వస్తోంది అనే చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలు ...ఎన్నికల తర్వాత బయటకు వస్తున్న విషయాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బిఆర్ఎస్ కు అతి పెద్ద మైనస్ గా మారిన అంశాల్లో ఒకటిగా ఒక సీనియర్ మంత్రి స్పష్టం చేశారు. అయితే కెటిఆర్ ప్రతిపాదనను తోసిపుచ్చుతూ కెసిఆర్ చెప్పిన అంశాలపై పార్టీ వర్గాలు ఆశ్చర్యకర అంశాలను వెల్లడించాయి. 35 నుంచి 40 మంది సిట్టింగ్ అభ్యర్థులను మార్చితే..వాళ్ళు ఇతర పార్టీల వైపు వెళతారని..అప్పుడు ఎన్నికలకు ముందే బిఆర్ఎస్ పని అయిపొయింది అనే చర్చతో ఎక్కువ నష్టం జరుగుతుంది అని కెసిఆర్ వాదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో గత పదేళ్ల కాలంలో నియోజవర్గాల్లో పాలన అంతా ఎమ్మెల్యే కేంద్రంగా...వాళ్లకు నచ్చినట్లు చేసుకోవటానికి అనుమతి ఇచ్చినందున ...సొంతంగా కూడా వాళ్ళు ఒక్కో చోట 25 నుంచి 30 వేల ఓట్ల వరకూ ప్రభావితం చేయగలరు అని...ఇది అసలు కే మోసం తెస్తుంది అని కెసిఆర్ స్పష్టం చేస్తూ..కెటిఆర్ ప్రతిపాదను నో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎలా అయినా నష్టం తప్పదని...అందుకే సిట్టింగ్ లను మార్చకుండా ముందుకు వెళితేనే నష్టం తక్కువ ఉంటుంది అని కెసిఆర్ లెక్కలు వేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే సర్వేల్లో వెల్లడవుతున్న విషయాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం విశేషం.

Next Story
Share it