Telugu Gateway
Telangana

సుప్రీం కోర్టు తీర్పులపై ..కెసిఆర్ డబల్ గేమ్ !

సుప్రీం కోర్టు తీర్పులపై ..కెసిఆర్ డబల్ గేమ్ !
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక వైపు అయన కేంద్రంలోని మోడీ సర్కారు చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదు అని మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ నాటికంటే దారుణ పరిస్థితి నెలకొందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరి తెలంగాణ లో కూడా అందుకు భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కేంద్రంలో మోడీ తరహాలోనే సుప్రీం కోర్టు , హై కోర్టు ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. హై కోర్టు చెప్పిన తర్వాత కూడా సీఎం కెసిఆర్ జాతీయ పండగ అయిన జనవరి 26 న రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవాలకు కూడా అయన హాజరు కాలేదు. కేవలం ప్రగతి భవన్ లో మాత్రం జెండా ఆవిష్కరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ప్రభుత్వం తరపున సిఎస్, డీజీపీ ఇతర అధికారులు హాజరు అయ్యారు.

సీన్ ఇక్కడ కట్ చేస్తే సరిగ్గా తొమ్మిది నెలల క్రితం సుప్రీం కోర్టు ఎన్నో ఏళ్ళ కింద జర్నలిస్ట్ లకు డబ్బులు కట్టి కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదేశించింది. తీర్పు వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తానని ఇదే కెసిఆర్ మీడియా సమావేశాల సాక్షిగా ఎన్ని సార్లు చెప్పారో లెక్కే లేదు. కానీ తీర్పు వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న కనీసం ఇదే అంశంపై మాట మాట్లాడకుండా...అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా మౌనం దాల్చుతున్న సీఎం కెసిఆర్ మాత్రం ఇదే అంశంపై మోడీ ని విమర్శిస్తూ మాట్లాడారు. అందులో నిజం ఉండొచ్చు. కానీ అయన ఇక్కడ అదే పని చేస్తూ ఇదే అంశంపై మోడీ ని విమర్శిస్తే సెట్ అవుతుందా అన్నదే ఇక్కడ పాయింట్.

సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ వివరాలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన కేంద్రంలోని బీజేపీ తీరు మారటం లేదు అని తెలంగాణ సీఎం కెసిఆర్ విమర్శించారు. అయన శనివారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి మీడియా తో మాట్లాడారు. భారతదేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని అయన మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, కేంద్రం ఆర్డినెన్స్‌పై ముగ్గురు ముఖ్యమంత్రులు చర్చించారు. దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితీమీరాయని కన్నెర్రజేశారు. బేజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ‘ ఏందీ గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ పదవి అలంకారప్రాయమైన పదవి. బడ్జెట్ పాస్ కానివ్వనని గవర్నర్ అంటే ఎలా..?. సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ పెట్టుకోవాల్సిన దుస్థితి. ఇంత ధౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైనా ఉంటదా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజార్టీతో గెలిచింది. అయినా మేయర్ ప్రమాణస్వీకారం చేయడానికి ముప్పుతిప్పలు పెట్టారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి మేయర్ ఎన్నిక నిర్వహించుకోవాల్సి వచ్చింది. అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వ హయాంలోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోంది. కేంద్రం తెచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంట్ వేదికగా వ్యతిరేకిస్తాం. ఆర్డినెన్స్‌ను ప్రధాని వెనక్కి తీసుకోవాలి. ప్రజలు మోదీ సర్కార్‌కు గట్టిగా బుద్ధి చెబుతారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారు. కేంద్రం తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కేంద్రం తీరు ఢిల్లీ ప్రజలను అవమానించేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి. గవర్నర్ వ్యవస్థను కూడా కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. అయినా సుప్రీం తీర్పును అమలు చేయకపోవడమేంటి..? మీకై మీరే ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోండి.. ఇది మీకు, దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. అండమాన్ పాలనకు ఢిల్లీ పాలనకు చాలా తేడా ఉంది, సుప్రీం తీర్పును కేంద్రం గౌరవించకపోతే దేశం పరిస్థితేంటి..?’ అని కేంద్రంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ లు బీజేపీ రాష్ట్ర కార్యాలయాలుగా మారాయన్నారు. విచిత్రం ఏమిటి అంటే ఆదివారం నాడు జరిగే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ అంశంపై మాత్రం కెసిఆర్ మౌనాన్ని ఆశ్రయించటం కీలకంగా మారింది.

Next Story
Share it