Telugu Gateway
Telangana

అంబేద్కర్ సిద్ధాంతాల అమలుకు అయన విగ్రహం కనపడాలా?

అంబేద్కర్ సిద్ధాంతాల అమలుకు అయన విగ్రహం కనపడాలా?
X

అంబేద్కర్ సిద్ధాంతాలు అమలుకు అయన విగ్రహం కనపడాలా?

హాట్ టాపిక్ గా మారిన సీఎం కామెంట్స్

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అధికారవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం వైపు కన్నెత్తి చూడకుండా పాలన సాగిస్తున్న సీఎం గా కెసిఆర్ రికార్డు సృష్టించారు. చివరకు మంత్రివర్గ సమావేశాలను కూడా ప్రగతి భవన్ కే పరిమితం చేశారు. సచివాలయం పక్కన శుక్రవారం నాడు అట్టహాసంగా 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిన విషయం తెలిసిందే. అక్కడ సీఎం కెసిఆర్ చేసిన కామెంట్స్ చూసి ఐఏఎస్ లు కూడా అవాక్కు అవుతున్నారు. ముందు కెసిఆర్ అక్కడ ఏమి అన్నారో చూద్దాం. ‘ప్రతి రోజు సెక్రటేరియట్ కు వచ్చే ముఖ్యమంత్రి కానీ...మంత్రులు కానీ, సెక్రెటరీలకు కానీ ఎప్పటికప్పుడు ఆలోచనలోకి వస్తూ ఉండాలి అంబేద్కర్ సిద్ధాంతం. అంబేద్కర్ ను చూస్తూ మనసు ప్రభావితం కావాలి. ఆ మార్గం పట్టాలి. అను నిత్యం అయన సిద్ధాంతం, సందేశం, ఆచరణ కళ్లలో మెదలాలి’ అంటూ సీఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తేనో...ఎవరో అడిగితే పెట్టలేదు. ఇంత అత్బుతమైన విశ్వమానవుడి విశ్వరూపాన్ని ఈ మూర్తి రూపంలో ఇక్కడ ప్రతిష్టించుకున్నాం అంటే ఒక బలమైన మెసేజ్ ఉంది...సందేశం ఉంది. ఇది ఉన్నటువంటి ప్రదేశం. సుందర దృశ్యమే కాకుండా రాష్ట్ర పరిపాలన సౌధమైన సెక్రటేరియట్ పక్కనే ఉంది. సెక్రటేరియట్ కు కూడా అంబేద్కర్ పేరే పెట్టుకున్నాం. పక్కనే అమరవీరుల స్మారకం ఉంది..ఆ పక్కనే అంబేద్కర్ నమ్మిన బుద్దుడి విగ్రహం కూడా ఉంది.

ఇవి అన్ని సందేశాత్మక చిహ్నాలు అని మనవి చేస్తున్నా అంటూ కెసిఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కెసిఆర్ తన హయాంలో సచివాలయానికి వచ్చిందే చాలా తక్కువ. ఇప్పుడు కొత్త సచివాలయం కట్టిన తర్వాత అయినా వస్తారో లేదో క్లారిటీ లేదు. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే అంబేద్కర్ సిద్ధాంతాలు...అయన చూపిన మార్గం అనుసరించాలి అంటే సచివాలయం పక్కన అంత పెద్ద విగ్రహం పెట్టాలా అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. అంటే అంబేద్కర్ విగ్రహం చూస్తేనే ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్ లకు అయన చెప్పిన విషయాలు గుర్తుకు వస్తాయా?. దేశంలో ఇంతవరకు ఎవరూ ఇలా చేయలేదు. కెసిఆర్ చెప్పింది నిజం అయితే సీఎం దగ్గరి నుంచి మంత్రులు, ఐఏఎస్ లు..సిబ్బంది ఆఫీస్ టేబుల్స్ మీద అంబేద్కర్ విగ్రహాలు పెట్టిస్తే సరిపోతుంది కదా అని మరో ఐఏఎస్ సందేహం వ్యక్తం చేశారు. ఇది అటు వెళ్ళినప్పుడు కనిపిస్తుంది...టేబుల్ మీద పెడితే అక్కడ ఉన్నంత సేపు విగ్రహం ఎదురుగా ఉంటుంది అంటూ అయన వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాల పాటు అంబేద్కర్ జయంతికి అయన విగ్రహానికి దండ వేయటానికి కూడా కెసిఆర్ బయటకు రాలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

Next Story
Share it