Telugu Gateway
Telangana

అప్పుడు ఏపీ..ఇప్పుడు కేంద్రం

అప్పుడు ఏపీ..ఇప్పుడు కేంద్రం
X

స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేత‌లు తీవ్ర అన్యాయం చేస్తే..ఇప్పుడు కేంద్రం అదే ప‌ని చేస్తోంద‌ని సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవంలో మాట్లాడిన కెసీఆర్ కేంద్రం తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పటి నుంచి కేంద్రం తెలంగాణ‌పై వివ‌క్ష చూపిస్తోంద‌ని ఆరోపించారు. నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉన్నా కూడా కేంద్రం తెలంగాణ స‌ర్కారును ఇబ్బందుల పాలు చేస్తోంద‌ని విమ‌ర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని, దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని కెసీఆర్ త‌ప్పుప‌ట్టారు. గురువారం నాడు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఆయ‌న జెండా ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. ''ఇప్పుడు దేశం ప్రమాదకరస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోంది. విచ్ఛిన్నకర శక్తులు ఇలాగే పేట్రేగిపోతే.. సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇలాగే ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు రావు. దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. దేశ ప్రజలకు కావాల్సింది.. కరెంట్‌, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి.ప్రగతి పథంలో దేశం పరుగులు పెట్టాలంటే.. నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది?. ఐదేళ్లకొకసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి.

దేశానికి నూతన గమ్యాన్నినిర్వహించాలి.. గుణాత్మక మార్పు రావాలి అని ఉద్ఘాటించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంతో పోరాడాల్సి వస్తోంది. ప్రగతి శీల రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించడం లేదు. నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని కోరినా ప్రయోజనం శూన్యం. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వడం లేదు. పన్ను మినహాయింపు లాంటి ప్రోత్సహాకాలు కూడా ఇవ్వడం లేదని అన్నారాయన. ఆఖరికి అత్యంత క్లిష్టమైన కరోనా సమయంలోనూ రాష్ట్రానికి కేంద్రం నయా పైసా సాయం అందించలేదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంగా రావాల్సిన నిధుల్లోనూ కేంద్రం కోత విధించిందని, ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు. తెలంగాణ ప‌లు రంగాల్లో దేశానికి మార్గ‌ద‌ర్శిగా..ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రాల‌పై విధిస్తున్న ఆర్ధిక ఆంక్షల‌ను ఎత్తేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రాల‌కు ష‌ర‌తులు పెడుతున్న కేంద్రం మాత్రం ఇష్టానుసారం అప్పులు చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

Next Story
Share it