ఎట్టకేలకు రాజ్ భవన్ కు కెసీఆర్

హైకోర్టు సీజె ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు రాజ్ భవన్ లోకి అడుగుపెట్టారు. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం దీనికి వేదిక అయింది. హైకోర్టు సీజెతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారనే విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు. అయితే గత కొంత కాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుండటంతో సీఎం కెసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా కారా అన్న అంశంపై అనుమానాలువ్యక్తం అయ్యాయి. హైకోర్టు సీజె ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం కెసీఆర్ పాల్గొంటారని ముందస్తు సమాచారం రావటంతో కూడా దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
గతంలోనూ ఇలాగే ప్రధాని మోడీ స్వాగత కార్యక్రమానికి సీఎం వెళతారని లీకులు ఇచ్చి మరీ డుమ్మా కొట్టారు. దీంతో ఈ ముందస్తు సమాచారంపై కూడా సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే గతానికి భిన్నంగా సీఎం కెసీఆర్ రాజ్ భవన్ లో జరిగిన హైకోర్టు సీజె భుయాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత జరిగిన తేనీటి విందుకు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకార సమయంలో హైకోర్టు సీజెకు బొకే ఇస్తూ కూడా మధ్యలోకి రావాలని గవర్నర్ ను సీఎం కెసీఆర్ కోరిన సన్నివేశాలు లైవ్ లో కన్పించాయి. ంతెలంగాణ ప్రభుత్వం తన విషయంలో ప్రొటోకాల్ పాటించకుండా నిబంధనలను ఉల్లంఘిస్తోందని..ఇది తనకు వ్యక్తిగతం కాదు..వ్యవస్థగా రాజ్ భవన్ కు అవమానం అంటూ గవర్నర్ తమిళ్ సై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.