కెసీఆర్ ఏరియల్ సర్వే..గవర్నర్ కొత్తగూడెం ఏరియా సర్వే

ముందు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై కొత్తగూడెం పర్యటన వార్తలే బయటకు వచ్చాయి. ఆ తర్వాత సీఎం కెసీఆర్ ఏరియల్ సర్వే పర్యటన ప్రకటన వెలువడింది. గవర్నర్ శనివారం రాత్రే కొత్తగూడెం రైలులో ప్రయాణించనున్నారు. ఆమె ఆదివారం నాడు కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీయనున్నారు. వాస్తవానికి గవర్నర్ పర్యటన వల్ల అప్పటికప్పుడు బాధితులకు సాయం అందేది ఏమీ ఉండదు. అయినా సరే తమిళ్ సై ముందుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధం అయ్యారు. ఇందుకోసం ఆమె ఢిల్లీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. కానీ సీఎం కెసీఆర్ ఆఫీసు నుంచి ఆకస్మాత్తుగా ఏరియల్ సర్వే ప్రకటన వెలువడింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎప్పటి నుంచో గవర్నర్ తమిళ్ సై పర్యటనలకు అధికారులు ప్రోటోకాల్ పాటించటం లేదు. దీనిపై ఆమె నేరుగానే ప్రభుత్వం విమర్శలు చేశారు. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ దుమారం రేగిన చాల కాలం తర్వాత ఇటీవలే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ తమిళ్ సై, సీఎం కెసీఆర్ ల ముఖాముఖి భేటీ అయ్యారు. ఆ సమయంలో రాజ్ భవన్ లో మర్యాదపూర్వక భేటీ జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీటింగ్ ఏర్పాట్లు కూడా చర్చకు వచ్చాయి.
సీఎం కెసీఆర్ సీటు వీరికి దూరంగా వేయటంపై ఆసక్తికర చర్చ జరిగింది. తాజాగా గవర్నర్ తమిళ్ సై వరద ముంపునకు గురైన ప్రాంతాల సందర్శన కూడా రాజకీయంగా దుమారం రేపే ఛాన్స్ కన్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లాల మంత్రులు తప్ప..భారీ విపత్తు జరిగినా సీఎం కెసీఆర్ ప్రగతి భవన్ నుంచి కాలు బయటపెట్టడం లేదని..కేవలం రాజకీయాల మీదే ఫోకస్ పెట్టారంటూ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో గవర్నర్ పర్యటన వార్తలు బయటకు వచ్చాక సీఎం కెసీఆర్ టూర్ ఖరారు వార్తలు వెలువడ్డాయి. సీఎం కార్యాలయం ప్రకటన సారాంశం ఇలా ఉంది...భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తు, తద్వారా గోదావరి పరీవాహక ప్రాంతం లో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సిఎం ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనున్నది. ఈ సర్వేలో సిఎం కెసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు. ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా, వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షాసమావేశాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.