కెసీఆర్ ఏరియల్ సర్వే రద్దు..రోడ్డు మార్గంలోనే భద్రాచలానికి
వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో సీఎం కెసీఆర్ ఆదివారం నాడు తలపెట్టన గోదావరి పరివాహక ప్రాంత ఏరియల్ సర్వే రద్దు అయింది. శనివారం రాత్రే వరంగల్ చేరుకుని అక్కడ బసచేసిన కెసీఆర్ ఆదివారం నాడు రోడ్డు మార్గం గుండా వరద బాధిత ప్రాంతాలను పరిశీలిస్తూ భద్రాచలం బయలుదేరారు. ములుగు, ఏటూరు నాగారం మీదుగా ఆయన ప్రయాణించారు. మార్గంమధ్యలో ఆగుతూ ప్రజా ప్రతినిధులను అక్కడి పరిస్థితులు తెలుసుకుంటూ ముందుకు సాగారు.
భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగుతున్నది. సీఎం పర్యటన కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీఎం ప్రయాణ మార్గంలో అక్కడక్కడ వరద బాధితులు తమకు సరైన సాయం అందటం లేదని నిరసనలు తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటన అనంతం సీఎం కెసీఆర్ అధికారులకు బాధితులకు అందజేయాల్సిన సాయంపై తగు ఆదేశాలు జారీ చేస్తారని చెబుతున్నారు.