పిల్లల వ్యాక్సినేషన్ పై వారే బాధ్యత తీసుకోవాలి
తెలంగాణలో సోమవారం నాడు 15-18 ఏళ్ల వయస్సు చిన్నారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కోవాగ్జిన్ వ్యాక్సినే దేశంలో పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండవ డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1014 ప్రభుత్వ కేంద్రాల్లో పిల్లలకు టీకాల కార్యక్రమం సాగుతోంది. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్ లలో కోవిన్ ద్వారా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్దతిలో టీకాలు వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
నాలుగు రోజుల తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రేజిస్ట్రేషన్ పై సమీక్షిస్తామని తెలిపారు. తల్లి తండ్రులు లేదా ఉపాధ్యాయుల సమక్షంలోనే టీకాలు అందిస్తామని, అన్ని కాలేజీల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు , తల్లి దండ్రులు.. పిల్లల వాక్సినేషన్ బాధ్యత తీసుకోవాలని హరీష్ రావు కోరారు. వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తది అనే అపోహ వద్దన్నారు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్,కాలేజి ఐడి కార్డ్ లో ఏది ఉన్నా సరిపోతుందని తెలిపారు.