తెలంగాణ అప్పులకు లైన్ క్లియర్
అప్పు పుడుతోంది. తెలంగాణ సర్కారు అప్పులకు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. దీంతో జూన్ 7 రిజర్వ్ బ్యాంక్ ఇండియా నిర్వహించే బాండ్స్ వేలంలో పాల్గొని 4000 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. పదమూడు సంవత్సరాల కాలవ్యవధితో ఈ బాండ్స్ జారీ చేయనున్నారు. గత కొంత కాలంగా కేంద్రం తెలంగాణ సర్కారు అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవటంతో రాష్ట్రం ఆర్ధిక సమస్యలతో నానా ఇబ్బంది పడింది. తాజా పరిణామం సర్కారుకు ఊరట కల్పించే అంశంగా చెప్పుకోవచ్చు.
కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులను విడిగా..బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా సమీకరించే అప్పులను వేరేగా చూపిస్తోంది. దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు వివరణలు కోరిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం కెసీఆర్ అప్పులపై పరిమితులను ఎత్తేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాము ఎఫ్ఆర్ బీఎం పరిధిలోనే అప్పులు చేస్తున్నామని..కేంద్రమే అడ్డగోలుగా అప్పులు చేస్తోందని కెసీఆర్ ఆరోపించారు.