Telugu Gateway
Telangana

ఈటల..రాజగోపాల్ రెడ్డి ఢిమాండ్స్ ను బీజేపీ ఆమోదిస్తుందా?!

ఈటల..రాజగోపాల్ రెడ్డి ఢిమాండ్స్ ను బీజేపీ ఆమోదిస్తుందా?!
X

ఒక జాతీయ పార్టీ రాష్ట్ర నాయకుల కోసం తన విధానాలు మార్చుకుంటుందా అంటే కచ్చితంగా అది జరిగే పని కాదు అని చెప్పొచ్చు. ఏ జాతీయ పార్టీ అయినా జాతీయ రాజకీయ అవసరాల కోణంలో వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి కానీ...అసలు గెలుస్తోంది లేదో క్లారిటీ లేని ఒక రాష్ట్రంలో ఒకరిద్దరు నేతలు డిమాండ్ చేసినంత మాత్రాన బీజేపీ హై కమాండ్ లొంగుతుంది అనుకుంటే అది పెద్ద పొరపాటే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక విషయం మాత్రం ఆ పార్టీని రాజకీయంగా తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. దీనికి ప్రధాన కారణం కూడా ఆ పార్టీ నేతలే తప్ప ఇతరులు ఎవరూకారు. ఢిల్లీ లిక్కర్ స్కాములో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తప్పదు అంటూ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ తో పాటు ఇతర కీలక నేతలు కూడా పలు మార్లు ప్రకటనలు చేశారు. ఢిల్లీ కి చెందిన కొంత మంది బీజేపీ నేతలు కూడా ఇదే తరహా ప్రకటలు చేశారు. సీన్ కట్ చేస్తే కారణాలు ఏంటో తెలియదు కానీ ఢిల్లీ లిక్కర్ స్కాములో ఎమ్మెల్సీ కవిత విషయంలో విచారణ సంస్థలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం లో కవితను అరెస్ట్ చేయకపోవటం వల్ల బీజేపీని ప్రజలు నమ్మటం లేదు అని...బీజేపీ, బిఆర్ఎస్ ఒకటే భావిస్తున్నారు అని ప్రకటించారు. తర్వాత ఏమి జరిగిందో కానీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ వంటి విషయాలు విచారణ సంస్థలు చేసుకుంటాయని కవర్ చేశారు.

మళ్ళీ ఇప్పుడు మరో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ను గద్దె దింపాలనే లక్ష్యంతో తాను, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళం పార్టీ లో చేరాం అని తెలిపారు. తాము ఉన్న పార్టీ లో వాళ్ళ వైఖరిలో మార్పు వస్తే అప్పుడు ఆలోచన చేస్తాం అని గతంలో చెప్పాము. కవిత విషయంలో కావొచ్చు. కెసిఆర్ కుటుంబం అవినీతి విషయంలో కావొచ్చు..ఏమైనా తాము అనుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఉదాసీన వైఖరి తో ఉంటే తాము డైరెక్ట్ గా అదిష్ఠానినానికే చెపుతాం ప్రజలు నమ్మటం లేదు అని...తొందరగా చర్యలు తీసుకోండి..ప్రజల్లో పార్టీ పై విశ్వాసం కల్పించండి అని కోరటం తప్ప అంత కంటే ఎక్కువ తాము చెప్పలేమన్నారు. తుది నిర్ణయం బీజేపీ అదిష్టానానిదే అని వెల్లడించారు. తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తమకు తెలుసు అని ...కవితను అరెస్ట్ చేయకపోవం వల్ల , కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ప్రజలు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో మాకు అర్ధం అయింది. ప్రజల్లో మోడీ, అమిత్ షా, నడ్డా నాయకత్వంపై విశ్వాసం వచ్చేలా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరతామని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో మొహమాటం ఏమీ లేదు...భయపడాల్సిన పని కూడా ఏమి లేదు అన్నారు. మరి బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఎలాంటి హామీ ఇస్తుందో వేచిచూడాలి.

Next Story
Share it