Telugu Gateway
Telangana

అందరూ కెసిఆర్ లాంటి ఇంజినీర్లు అవ్వాలంటే కష్టమే మరి!

అందరూ కెసిఆర్ లాంటి ఇంజినీర్లు అవ్వాలంటే కష్టమే మరి!
X

తెలంగాణ లో అందరూ కెసిఆర్ లాగా ఇంజినీర్లు కావాలంటే కష్టమే మరి. కెసిఆర్ తానే స్వయంగా రక్తం చిందింది...చెమటోడ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లు తయారు చేసినట్లు అధికారికంగా..మీడియా సమావేశంలో చెప్పుకున్నారు. మరి లక్ష కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏమైందో ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన బ్యారేజ్ లు ఇప్పుడు అసలు పనికి వస్తాయో రావో తెలియని పరిస్థితి. జాతీయ డ్యామ్ రక్షణ అధారిటీ (ఎన్ డీఎస్ఏ) తుది నివేదిక వస్తే కానీ వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో మూసీ పునర్జీవ ప్రాజెక్ట్ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. భవిష్యత్ హైదరాబాద్ కోసం ఇది అవసరం అని ప్రభుత్వం చెపుతుంటే...దీని వెనక వేరే ఎజెండా ఉంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ సర్కారు కొంత మంది ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు మీడియా ప్రతినిధుల బృందాన్ని కూడా దక్షిణ కొరియా లోని సియోల్ పర్యటనకు తీసుకెళ్లింది. ఒక వైపు ప్రభుత్వం ఇంకా మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధం కాలేదు అని చెపుతుంటే నిపుణులు తమ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత లక్షన్నర కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చును ఎలా సమర్థిస్తారో అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నిపుణులు అంతా మంచి ఫలితాలు తీసుకురాగలరు అని పేర్కొన్నారు.

అధికారంలో ఉండగా అటు కెసిఆర్, ఇటు కేటీఆర్ లు ప్రజలు తమను ఎన్నుకున్నారు అని...తమ ఇష్ట ప్రకారం నడుచుకుంటాం తప్ప ఎవరో చెపితే వినాల్సిన అవసరం తమకు లేదు అన్నట్లు వ్యవహరించిన విషయం తెలిసిందే. టిఎస్ పీఎస్ సి పేపర్ లీక్ ల సమయంలో తమకు మీడియా పాఠాలు చెప్పాల్సిన పని లేదు అని..మీడియా కంటే ఎన్నికైన తమకే బాధ్యత ఎక్కువ ఉంటుంది అని కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం తమ అంతా ప్రజాస్వామ్య వాదులు లేరు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ ట్వీట్ చూస్తే మీడియా టీం ను విదేశీ పర్యటనకు తీసుకెళ్లటం పైనే ఆయన వ్యంగ్యాస్త్రాలు సాధించినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మీడియాతో అటు కెసిఆర్, ఇటు కేటీఆర్ లు ఎలా వ్యవహరించారో అందరికి తెలిసిందే. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమి మారినట్లు కనిపించటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ హయాంలో సాగిన దోపిడీకి సంబదించిన అంశాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్లే వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు అనే చర్చ కూడా కాంగ్రెస్ నాయకుల్లో సాగుతోంది. ఈ విషయంలో అందరూ సీఎం రేవంత్ రెడ్డి వైపే వేలెత్తి చూపిస్తున్నారు.

Next Story
Share it