Telugu Gateway
Telangana

నాడు సవాళ్లు...నేడు విల విల

నాడు సవాళ్లు...నేడు విల విల
X

తెలంగాణ లోని అధికార బిఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందా?. ఆ పార్టీ అగ్రనేతల మాటలు చూస్తుంటే ఎవరికైనా ఇవే అనుమానాలు రాక మానవు. ఎన్నికల ప్రచారంలో సీఎం కెసిఆర్ దగ్గర నుంచి మంత్రి కేటీఆర్, హరీష్ రావు లు తాము తప్ప ఎవరు అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రమాదంలో పడుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. బుధవారం నాడు ఎన్నికల ప్రచార సభలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పొచ్చు. తెలంగాణ గొంతుక..52 కిలోల కెసిఆర్ ను ఖతం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. మోడీ, రాహుల్ లు కెసిఆర్ పై పగ పట్టారని..తెలంగాణాలో గెలిస్తే బిఆర్ఎస్ దేశమంతటా విస్తరిస్తుంది అని అయన గొంతు పిసికేందుకు చూస్తున్నారు అంటూ సంచనలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటివరకు మోడీ, ఈడీ, సిబిఐ ఎవరూ తమను ఏమీ పీకలేరు అంటూ అంటూ పదే పదే మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు ఎందుకు సెంటిమెంట్ డైలాగులు వాడుతున్నారు. సరే మోడీ గురించి అన్నారు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ..అయన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేస్తారు అనటంలో కొంత అర్ధం ఉంది.

అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్..రాహుల్ గాంధీ అసలు కెసిఆర్ గొంతు ఎలా పిసకగలరు?. దేశంలో ఎవరైనా కెసిఆర్ గొంతు పిసికే సాహసం చేయగలరా?. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా...పదేళ్లు దేశంలోనే అద్భుతంగా పాలించాం అని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ప్రజలు తమకు కాక ఇంకెవరికి ఓటు వేస్తారు అనే ధీమా ప్రదర్శించాల్సింది పోయి కెసిఆర్ గొంతు పిసకటానికి చూస్తున్నారు...కుట్రలు చేస్తున్నారు...కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని ఆగిపోతాయి అనే ప్రచారం చేయటం అంటే బిఆర్ఎస్ కు ఎక్కడో లెక్క తేడా కొడుతుందేమో అన్న సందేహం ప్రజల్లో రావటం ఖాయం. దీనికి ప్రధాన కారణం బిఆర్ఎస్ కీలక నేతల మాటలే కారణం కావటం విశేషం. గతంలో ఎన్నడూ లేని రీతిలో అధికార బిఆర్ఎస్ పలు ఫేక్ ప్రచారాలతో కూడా ఈ ఎన్నికల్లో అడ్డంగా బుక్ అయింది. తెలంగాణ లో జరిగిన అభివృద్ధికి సంబంధించి కూడా వాస్తవ లెక్కలు ఒకలా ఉంటే బిఆర్ఎస్ మాత్రం వీటిని ఎక్కువ చేసి చూపిస్తోంది అనే విమర్శలు ఉన్నాయి. చిరవకు హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్య విషయంలోనే దొంగ లెక్కలు చెప్పటం బిఆర్ఎస్ కే చెల్లింది.

Next Story
Share it