Telugu Gateway
Telangana

కాంగ్రెస్ లో చీలికకు బిఆర్ఎస్ ప్లాన్ వేస్తుందా?

కాంగ్రెస్ లో  చీలికకు బిఆర్ఎస్ ప్లాన్ వేస్తుందా?
X

అధికారం కోల్పోయినప్పటి నుంచి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలతో పాటు బయట కూడా తీవ్ర చర్చనీయాంశగా మారింది. అయన మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత కొంత మంది సొంత పార్టీ నాయకులు కూడా ఓటమి తర్వాత కూడా కేటీఆర్ లో ఎలాంటి మార్పు కనిపించటంలేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ధోరణి కనబర్చితే పార్టీకి మరింత నష్టం తప్ప...ఎలాంటి ఉపయోగం ఉండదు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇంకా రెండు నెలలు కూడా కాలేదు కానీ అప్పుడే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయపోతే నడిరోడ్డులో కాంగ్రెస్ వాళ్ళ బట్టలు ఊడదీసి నిలబెడతాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ ఎగవేసిన హామీలు ఎన్నో లెక్కేలేదు. అలాగని కాంగ్రెస్ హామీలు అమలు చేయక్కరలేదు అని ఎవరూ చెప్పరు. కానీ కేటీఆర్ మాటలు చూస్తుంటే అయన ఓటమిని ఏ మాత్రం జీర్ణించుకోలేక..అక్కసు వెళ్లగక్కుతున్నారు అనే భావన అయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది.

తాజాగా కేటీఆర్ త్వరలోనే కెసిఆర్ ను సీఎం చేసుకుందాం అని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఎన్నికలు జరిగి ఇంకా మూడు నెలలు కూడా కాకముందే మళ్ళీ కెసిఆర్ ను సీఎం ఎలా చేస్తారు అనే ప్రశ్న ఉదయించటం సహజం. కొంత మంది బిఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి కెసిఆర్ ను సీఎం చేస్తారా?. త్వరలోనే సీఎం చేయటం అంటే ఉన్న మార్గం ఇది ఒక్కటే తప్ప మరేమి లేదు అనే చెప్పొచ్చు. అధికారంలో ఉన్నంత కాలం సమాచార హక్కు చట్టాన్ని కెసిఆర్ సర్కారు ఎలా నిర్వీర్యం చేసిందో ప్రజలందరూ చూశారు. హై కోర్ట్ చెప్పినా కూడా అప్పటి సీఎం కెసిఆర్ సమాచార హక్కు కమిషనర్ల నియామకం చేపట్టలేదు. కానీ ఇప్పుడు కేటీఆర్ మాత్రం బిఆర్ఎస్ కార్యకర్తలు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. ఇలా కేటీఆర్ ఓటమి తర్వాత తన విచిత్ర వ్యాఖ్యలతో బిఆర్ఎస్ ను మరింత ఇరకాటంలో పెడుతున్నారు అనే చర్చ ఆ పార్టీ నేతల్లోనే సాగుతోంది.

Next Story
Share it