Telugu Gateway
Telangana

కెసిఆర్ ఉండగా నాయకత్వ ఇష్యూనే రాదన్నారు..ఇప్పుడు ఇలా ఎందుకు?!

కెసిఆర్ ఉండగా నాయకత్వ ఇష్యూనే రాదన్నారు..ఇప్పుడు ఇలా ఎందుకు?!
X

బిఆర్ఎస్ లో ఏదో జరుగుతుంది?

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఫుల్ యాక్టీవ్ గా ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే మేము అంతా పని చేస్తున్నాం...ఆయన ఉన్నప్పుడు అసలు నాయకత్వ సమస్య ఎందుకు వస్తుంది. ఇది నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు పలు మార్లు చెప్పిన మాట. కొద్ది రోజుల క్రితం జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సభ సమయంలో ప్రధాన వేదికపై కేవలం కెసిఆర్, కేటీఆర్ ల ఫోటో లు మాత్రం పెట్టిన సంగతి తెలిసిందే. ఇది కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత తో పాటు , సీనియర్ నేత హరీష్ రావు కు కూడా ఏ మాత్రం రుచించలేదు. హరీష్ రావు ఎక్కడా కూడా అధిష్టానం పై అసంతృప్తి వ్యక్తపరిచే పనులు చేయకపోయినా..ఎమ్మెల్సీ కవిత మాత్రం గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు బిఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి అనే చెప్పాలి. గత పదేళ్ల కాలంలో అంటే బిఆర్ఎస్ హయాంలో సామజిక తెలంగాణ సాధ్యం కాలేదు అంటూ ఆమె ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన తర్వాత అందరి అభిప్రాయాల మేరకే ఈ మాట చెప్పినట్లు స్పష్టం చేశారు. తనపై కొంత పార్టీ లో దుష్ప్రచారం చేస్తున్నారు అని..పార్టీ దీన్ని ఖండిస్తోంది అని భావిస్తున్నట్లు ప్రకటించిన మరింత కలకలం రేపారు. లేకపోతే తర్వాత దీని వెనక ఉన్న వాళ్ళ పేర్లు అన్ని బయటపెడతా అన్నారు కవిత.

మంగళవారం నాడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి అనే చెప్పాలి. కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తాను..తప్పకుండా నేను సహకరిస్తా.ఒక కార్యకర్తగా హరీష్ రావు...పార్టీ నిర్ణయాన్ని..కెసిఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. 25 ఏళ్ళ నుంచి అదే చేస్తున్నాను అని..రాబోయే రోజుల్లో కూడా అలాగే చేస్తాను అన్నారు హరీష్ రావు. ఒక వైపు కవిత...మరో వైపు హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే బిఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ చేతికి వెళ్లే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. కేవలం బిఆర్ఎస్ పగ్గాలు వరకే వెళ్తాయా..లేక ప్రతిపక్ష హోదా కూడా మారుతుందా అన్నది తెలియాలి అంటే కొద్ది రోజులు చూడాల్సిందే. ప్రతిపక్ష హోదా ఉన్న తర్వాత కూడా కెసిఆర్ అసలు అసెంబ్లీ వైపు చూడడటం లేదు. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న ఆ పార్టీ నేతలు ఏదో కవరింగ్ చేసుకుంటూ వస్తున్నారు.

Next Story
Share it