Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ నేతల విచిత్రాలు

బిఆర్ఎస్ నేతల విచిత్రాలు
X

ఎన్నికల వేళ బిఆర్ఎస్ నేతల పాట్లు అన్నీ ఇన్నీ కావు. అసలు తెలుగు దేశం అధినేత చంద్రబాబు పేరు ఎత్తితేనే ఆ పార్టీ కీలక నేతలు కెసిఆర్, కేటీఆర్ లు మండిపడేవాళ్లు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు మళ్ళీ వచ్చారు అంటూ విస్తృతంగా ప్రచారం చేసి కెసిఆర్ రాజకీయంగా లబ్దిపొందారు. కానీ ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు విచిత్రంగా చంద్రబాబు జపం చేస్తున్నారు. విచిత్రంగా బుధవారం నాడు హైదరాబాద్ లో ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అయింది అనే చెప్పొచ్చు. చంద్రబాబు కు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు అనారోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. న్యాయమే గెలిచింది...చంద్రబాబు నాయుడు కి స్వాగతం అంటూ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసరి గోపి కృష్ణ ఒక ప్రకటన ఇచ్చారు. ఇందులో చంద్రబాబు ఫోటో తో పాటు ఒక వైపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఫోటో, మరో వైపు దివంగత ఎన్టీఆర్ ఫోటోలను పెట్టారు. ఈ నియోజకవర్గంలో చంద్రబాబు సామాజిక వర్గం ఓట్లతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ తిప్పలు పడుతున్నారు అని పార్టీ నాయకులూ వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క గాంధీనే కాదు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కూడా కొద్ది రోజుల క్రితం అటు ఎన్టీఆర్ , ఇటు చంద్రబాబు లపై ప్రశంసలు కురిపించారు.

ఒకప్పుడు టీడీపీని, చంద్రబాబు ను తీవ్రంగా వ్యతిరేకించిన బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి టీడీపీ ఓట్ల కోసం నానా తిప్పలు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే మంత్రి కేటీఆర్ చంద్రబాబు అరెస్ట్ విషయం తమకు సంబంధం లేదు అని ...అది ఆంధ్ర ప్రదేశ్ గొడవ అంటూ వ్యాఖ్యానించారు. తర్వాత కొంత మంది ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో నిరసనలు చేయగా..ఇక్కడ ఎలా చేస్తారు...ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమండ్రిలోనే, విశాఖపట్నంలో, విజయవాడలో చేసుకోవాలంటూ కామెంట్ చేయటం..అది పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో దీనిపై పెద్ద ట్రోలింగ్ సాగగా తర్వాత బిఆర్ఎస్ నేతలు గొంతు సవరించుకున్నారు. టీడీపీ ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలకు చెందిన బిఆర్ఎస్ మంత్రులు...ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే బిఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఈ సారి వారి ఓట్లు ఏ మాత్రం బిఆర్ఎస్ వైపు మొగ్గే అవకాశం లేదు అనే అంచనాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కానీ ఈ లెక్కలు తేలవు. ఎన్నికల లోపు ఇంకా బిఆర్ఎస్ నేతలు ఎన్ని విచిత్రాలు చేస్తారో చూడాలి.

Next Story
Share it