Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి

బిఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి
X

దేశం సంగతి ఏమో కానీ...రాష్ట్రంలోనే బిఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎన్నికల ఏడాదిలోకి వచ్చిన తరుణంలో వరసపెట్టి వెంటాడుతున్న అంశాలు ఆ పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. టిఎస్ పీఎస్ సి పేపర్ల లీక్..పరీక్షల రద్దు అనేది బిఆర్ఎస్ కు అతి పెద్ద షాక్..వచ్చే ఎన్నికల్లో పార్టీ జాతకాన్ని తారుమారు చేయటానికి ఇది ఒక్కటి చాలు అనే చర్చ సాగుతోంది. వేయక వేయక వేసిన నోటిఫికేషన్లు..వేసిన నోటిఫికేషన్ల పేపర్లు కూడా లీక్..చివరకు పరీక్షల రద్దుతో నిరుద్యోగ యువత రగిలిపోతోంది. మళ్ళీ వెంటనే పరీక్షలు పెడతామన్నా కూడా అది అంత ఈజీ గా జరిగే పని కాదు అన్న అభిప్రాయం కూడా నిపుణుల్లో వ్యక్తం అవుతోంది. కారణాలు ఏమైనా ఈ ఏడాది లో పరీక్షలు జరగకపోతే మాత్రమే ఇక అంతే సంగతులు అన్న భయం బిఆర్ఎస్ నేతల్లో ఉంది. ఇప్పటికే లిక్కర్ స్కాం తో సమస్యలు వస్తున్నాయని...ఇప్పుడు కొత్తగా ఇది వచ్చి పడింది అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. పాలకులు తమకు అవసరం అయిన వాటిని తప్ప పూర్తిగా పరిపాలనను వదిలేసిన ఫలితాలే ఇవి అన్నీ అని మరో నేత అభిప్రాయపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాములో స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మీదే నేరుగా తీవ్రమైన ఆరోపణలు రావటంతో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయ టార్గెట్ గానే తమపై కేసు లు అంటూ కెసిఆర్ దగ్గర నుంచి కెటిఆర్ , కవిత లు చెపుతున్నా వీటిని ప్రజలు ఏ మాత్రం నమ్మటం లేదు అని ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు.

మార్చి 20 న జరగనున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఒక వైపు లిక్కర్ స్కాం లో కవిత ఆరోపణలు ఎదుర్కోవటం..తాజాగా టిఎస్ పీఎస్ సి పేపర్ల లీక్ పెద్ద సంచలనంగా మారింది. వీటికి తోడు ఇప్పటికే తెలంగాణ సర్కారు ధరణి విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. సర్కారు అంత సవ్యంగా ఉంది అని చెపుతున్నా కూడా...రైతులు మాత్రం క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు...దళిత బందు కు నిధులు సమకూరుతాయా అన్నది ఒక పెద్ద సవాలుగా మారనుంది. మరో వైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఊసు ఇప్పటివరకు లేదు. ఇలా చెప్పుకుంటే పోతే జాబితా చాలా ఉంది. ఈ అంశాలు అన్నీ బిఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వీటికి తోడు పదేళ్ల పాలనపై పలు వర్గాల్లో అసంతృప్తి...స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకిత ఇలా ఎన్నో సమస్యలు బిఆర్ఎస్ కు సవాలుగా మారబోతున్నాయి. మరి వీటిని అధిగమించి మూడవ సారి అధికారంలోకి రావటం అంటే అంత ఈజీ కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎన్నికల నాటికీ లిక్కర్ స్కాం తరహాలో ఇంకా కొత్త అంశాలు వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యం లేదు అని చెపుతున్నారు.

Next Story
Share it