దేశానికి దారి చూపే వాళ్ళు...చివరకు ఇలా!
దేశం అంతా తెలంగాణ విధానాలు..పథకాలను కాపీ కొడుతున్నారు. ఇది బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు పదే పదే చెప్పే మాటలు. దేశాన్ని అమెరికా, చైనా లను దాటించే శక్తి ఉన్న కెసిఆర్ చివరకు కాంగ్రెస్ హామీలను కాపీ కొట్టడం ఏమిటి?. ఇప్పుడు అంతా ఇదే చర్చ. కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆరు కీలక హామీలను ప్రకటించింది. అందులో అత్యంత కీలకమైనది మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయలు ఇస్తామని వెల్లడించింది. ఇప్పుడు కెసిఆర్ దాన్ని కాపీ కొట్టి తాము అధికారంలోకి వస్తే మహిళలకు 3000 రూపాయలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు . అంటే కాంగ్రెస్ చెప్పిన దానికి మరో ఐదు వందల రూపాయలు జోడించారు అన్న మాట. ఇక్కడ మరో కీలక విషయం ప్రస్తావించుకోవాలి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. అప్పటిలో దీనిపై అసలు నిరుద్యోగుల లెక్కలు ఎక్కడ ఉన్నాయి...అసలు ఇది ఎలా సాధ్యం అవుంతుందా అని ప్రశ్నించారు. అక్కడ సీన్ కట్ చేస్తే అసలు ఇది ఎలా సాధ్యం..లెక్కలు ఎక్కడ అంటూ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి తిరిగి బిఆర్ఎస్ కూడా మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పిన దాని కంటే మరో పదహారు రూపాయలు జోడించి 3016 రూపాయలు హామీ గుప్పించారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిరుదోగ్య భృతి ఇవ్వలేదు కెసిఆర్ సర్కారు. మళ్ళీ కొత్త మ్యానిఫెస్టో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే పేదలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు దాన్ని కాపీ కొట్టిన బిఆర్ఎస్ ఒక వంద రూపాయలు తగ్గించి గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే అని మ్యానిఫెస్టో లో ప్రకటించింది.
మరో కీలక హామీ చేయూత కింద పెన్షన్ నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. దీంతో పాటు పది లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దానికి కౌంటర్ గా అన్నట్లు ఆసరా పెన్షన్లను ఐదేళ్లలో 5 వేల రూపాయలకు పెంచుతాం అని ప్రకటించారు. మొదటి సంవత్సరం వెయ్యి.. అంటే 3,016 రూపాయలకు పెంచుతాం అన్నారు. తర్వాత ఏటా ఐదు వందలు పెంచుతారు అట. కెసిఆర్ బీమా కింద ఐదు లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని బిఆర్ఎస్ ప్రకటించింది. గత తరహాలో ఇప్పుడు కూడా మాయ హామీలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇళ్ల స్థలాలకు భూమి లేదు అని చెప్పి..జాగా ఉన్న వారికే డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకోవటానికి డబ్బులు ఇస్తామని చెప్పి..మళ్ళీ కొత్తగా మ్యానిఫెస్టో లో మాత్రం రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తున్నాం అని ప్రకటించారు. గత ఎన్నికల్లో అత్యంత కీలకంగా ఇచ్చిన లక్ష రూపాయలు రైతు రుణ మాఫీని ఐదేళ్ల చివరిలో అంటే తాజాగా అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం రైతు రుణ మాఫీ హామీని పూర్తిగా ఎత్తివేసింది బిఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము అధికారంలోకి వస్తే ఒకే సారి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నో కాంగ్రెస్ కీలక హామీలకు బిఆర్ఎస్ కాపీ కొట్టింది అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ పై వివిధ వర్గాల్లో వ్యతిరేకత ఉంది అని ప్రచారం జరుగుతున్న వేళ బిఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో అత్యంత సాదాసీదా గా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.