Telugu Gateway
Telangana

కెసిఆర్ లో భయం మొదలైందా?!

కెసిఆర్ లో భయం మొదలైందా?!
X

పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించటంతో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లో దడ ప్రారంభం అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితాలు ఇంకా పూర్తి స్థాయిలో రాక ముందే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదు అంటూ ఉలిక్కిపడినట్లు ట్వీట్ చేశారు. దీంతోనే సీన్ అర్ధం అయింది...వీళ్ళు ఎంత టెన్షన్ లో ఉన్నారో. ఇంత కాలం తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాను...ఇక బంగారు భారత్ అంటూ ప్రకటనలు చేయటమే కాదు...తనకు తప్ప కాంగ్రెస్..బీజేపీలకు దేశాన్ని పాలించటం చేతకాదు అని ప్రకటించిన సీఎం కెసిఆర్ ఇప్పుడు రివర్స్ గేర్ వేశారు. జాతీయ రాజకీయాలను పక్కన పెట్టి...రాష్ట్రంపైనే ఫోకస్ పెట్టపోతున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ ఒక కథనం ఇచ్చింది. అంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కెసిఆర్ వెనక్కు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మరో సారి అక్కడ బీజేపీ గెలిచి ఉంటే మాత్రం కెసిఆర్ అప్పుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టవారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీని ప్రకారం అసలు కెసిఆర్ జాతీయ రాజకీయాల అసలు ఎజెండా వేరే ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. దేశానికీ తాను మాత్రమే దిక్కు అని కెసిఆర్ ప్రకటిస్తే...ఆ పార్టీ కి చెందిన నేతలు, మంత్రులు కాబోయే ప్రధాని కెసిఆర్ మాత్రమే అంటూ నిన్నమొన్నటి వరకు ప్రకటనలు చేశారు. ఇప్పుడు కెసిఆర్ జాతీయ రాజకీయాలపై రివర్స్ గేర్ వేయటం వల్ల తెలంగాణాలో కూడా ఇది మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోనే బిఆర్ఎస్ కు ఏ మాత్రం వాతావరణం అనుకూలంగా లేదు అని...అందుకే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు.

పలు వర్గాల్లో అధికార బిఆర్ఎస్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వీళ్ళు అంతా అదను కోసం కాచుకుని కూర్చున్నారు. కర్ణాటక ఫలితాలతో కంగుతిన్న బిఆర్ఎస్ అధిష్టానం జాతీయ రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టి కేవలం మహారాష్ట్రలో లోకల్ బాడీస్ వరకు పరిమితం అవుతారు అని చెపుతున్నారు. పక్కన ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇంత వరకు బిఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని అయితే పెట్టింది కానీ అక్కడ ఒక్క కార్యక్రమం చేయలేదు. బీజేపీ తో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది. నాయకుల మధ్య విభేదాలు పక్కన పెట్టి పోరాడితే కర్ణాటక ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అనే ఆశల్లో ఆ పార్టీ నేతలు ఉన్నారు. కర్ణాటక ఫలితాలు కూడా తెలంగాణ కాంగ్రెస్ కు జోష్ ఇచ్చాయి. దీంతో కెసిఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడితే అసలుకే మోసం వస్తుంది అని గ్రహించారు అని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయినా కూడా తెలంగాణ లో బిఆర్ఎస్ ఆశించిన ఫలితాలు సాధించటం అంత తేలిక కాదు అనే అభిప్రాయం ఆ పార్టీ నేతలలోనే ఉంది. దీనికి ప్రధాన కారణం రెండు సార్లు అధికారంలో ఉండటం ఒకటి అయితే...ఒంటెద్దు పోకడలు...కేంద్రీకృత పాలన వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ కేబినెట్లో సొంతంగా వారి వారి శాఖల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు అని...అంతా వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం సాగాల్సిందే అని ఒక సీనియర్ మంత్రి తెలిపారు.

Next Story
Share it