గ్రేటర్ లో బిజెపి దూకుడు
గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి దూకుడు చూపిస్తోంది. మరి ఇది వర్కవుట్ అవుతుందా? అంటే వేచిచూడాల్సిందే. గత కొన్ని రోజులుగా బిజెపి నేతలు అధికార టీఆర్ఎస్ పై వాడివేడి విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్ ఇదే దూకుడు చూపించేది. ఇప్పుడు బిజెపి వంతు వచ్చింది. వరదసాయంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పదివేల ఆర్థిక సాయం ఆపాలంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేరు మీద ఎన్నికల సంఘానికి రాసినట్లు సీఎం కెసీఆర్ ప్రకటించారు. ఇది పెద్ద దుమారానికి కారణం అయింది. వరదసాయం ఆగిపోవడానికి బీజేపీ నేతలే కారణమంటూ టీఆర్‌ఎస్ నేతలు విమర్శలకు దిగగా.. ఆ లేఖతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ సంజయ్ చెబుతున్నారు. తమను దొంగదెబ్బ తీయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిన నాటకంలో భాగమే ఈసీకి లేఖ అని ఎదురుదాడికి దిగారు. తన పేరు మీద సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ తాను రాయలేదని, సీసీఎస్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖపై నిజాలు తేల్చుకుందామంటూ సీఎం కేసీఆర్‌కు సంజయ్ సవాలు విసిరారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రావాలంటూ సవాల్ చేశారు.
లేఖను తాను రాలేదని ఆమ్మవారిపై ప్రమాణం చేస్తానని తేల్చి చెప్పారు. దీనిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి చార్మినార్ వరకు శుక్రవారం బైక్ ర్యాలీకి కాషాయదళం సిద్ధమైంది. ఇప్పటికే బీజేపి కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు సంజయ్ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని మొదట చెప్పిన పోలీసులు.. ఆ తరువాత అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే శుక్రవారం కావడంతో చార్మినార్ వీధుల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే బీజేపీ కార్యాలయం ముందు,చార్మినార్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండార్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు.