కలకలం రేపుతున్న కొంత మంది మంత్రుల దందాలు
తెలంగాణ కాంగ్రెస్ సర్కారు విషయంలో నిన్న మొన్నటి వరకు పాలనా పరమైన అంశాలపైనే విమర్శలు ఉండేవి. ఇప్పుడు రాజకీయ అంశాలు కూడా తెర మీదకు వచ్చాయి. ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న ఒక మంత్రిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం కలకలం రేపుతోంది. తనకున్న ఆర్థిక వనరులతో తానే ఎప్పటికైనా కీలక పదవి దక్కించుకుంటానని..ప్రభుత్వంలో తానే స్వయంప్రకటిత నంబర్ టూ అని ఆ మంత్రి తన చర్యలతో మొత్తానికి పార్టీని..ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసే పరిస్థితి తీసుకువచ్చారు. ఈ వ్యవహారం వెంటనే సర్దుబాటు చేయకపోతే అసలుకే మోసం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనే చర్చ సాగుతోంది. ఆయన హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద ఎత్తున కబ్జాలతో పాటు భూ దందాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం సహచర మంత్రులు...కీలక కాంగ్రెస్ నేతలను కలుపుకుని వెళుతున్న ఆయన..మరికొన్ని చోట్ల ఏకపక్షంగా ఇష్ఠానుసారం చేస్తుండటం అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణం అయింది అని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆ మంత్రి దోపిడీకి అడ్డు లేకుండా పోయింది అని సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెపుతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కూడా తాము నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోని కొంత మంది మంత్రులు వాళ్ళు మాత్రం ఇష్టానుసారం దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలను పక్కన పెడితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కి ఉన్నదే బొటాబోటి మెజారిటీ. అలాంటిది ఏకంగా దగ్గర దగ్గర అధికార పార్టీ కి చెందిన పది మంది ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై నిరసనగా సమావేశం పెట్టుకునే వరకు పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్ లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత మంది మంత్రుల తీరు తమ శాఖలు అంతా తమ ఇష్టమే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు అనే చర్చ అధికార వర్గాల్లో కూడా సాగుతోంది. ఎక్కడా కూడా మంత్రుల మధ్య సమన్వయం..ఉమ్మడి బాధ్యత అన్నది మచ్చుకైనా కనిపించటం లేదు అనే చర్చ సాగుతోంది. మంత్రుల తీరు ఎంత దారుణంగా ఉంది అంటే ఇటీవల రేషన్ కార్డుల అంశంపై వీడియో కాన్ఫరెన్స్ పెడితే అధికారుల ముందు ముగ్గురు మంత్రులు మూడు వాదనలు వినిపించటంతో ఇది విన్న కలెక్టర్లకు కూడా షాక్ తగిలినంత పని అయింది అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ప్రభుత్వం తొలుత స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుని తర్వాత అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సింది పోయి..అధికారుల ముందు మంత్రులు తలా ఒక మాట మాట్లాడితే ప్రభుత్వ పరువు పోవటం తప్ప ఏమీ ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏడాది తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా గాడిన పడినట్లు లేదు అనే సంకేతాలు ఉండటం ఏ మాత్రం మంచి ది కాదు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ తరుణంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా మంత్రుల దోపిడీపై సమావేశం పెట్టుకోవటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేయాలా అని చూస్తోంది. ప్రభుత్వం ఏ పని తీసుకున్నా దానిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అధికార పార్టీని ఇరకాటంలో పడేలా చేస్తోంది. అందరూ కలిసి ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సింది పోయి కొంత మంది మంత్రులే వాళ్లకు ఆయుధాలు ఇస్తున్నారు అనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచే వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి.