Telugu Gateway
Telangana

తెలంగాణ కీల‌క స్కీమ్ ల‌పై నీలినీడ‌లు

తెలంగాణ కీల‌క స్కీమ్ ల‌పై నీలినీడ‌లు
X

తాజా పరిస్థితులను బట్టి చూస్తే తెలంగాణ సర్కారు 2679 కోట్ల రూపాయల అంచనాతో హైదరాబాద్ లో తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ముందుకు సాగటం కష్టమే అని అధికారులు తేల్చారు. అంతే కాదు. తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం ప‌రిస్థితి కూడా అంతే. 2022-23 బడ్జెట్ లో దీని కోసం రూ.7,289 కోట్లు కేటాయించారు. ఇది కూడా ముందుకు సాగటమే కష్టమే అంటున్నారు. అన్నింటి కంటే అత్యంత కీలకమైనది దళితబంధు పథకం. దీని కోసం ఈ బడ్జెట్లో ఏకంగా 17700 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనికి సంబంధించిన అసలు సినిమా జులై నుంచి కన్పిస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అంతే కాదు..తెలంగాణ సర్కారు బడ్జెట్ అంచనాలు కూడా భారీ ఎత్తున తారుమారు కానున్నాయి. దీనికి కారణం కేంద్రం అప్పులపై ఆంక్షలు పెట్టడం ఒకెత్తు అయితే..ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 41 వేల కోట్ల రూపాయలువ స్తాయని తెలంగాణ సర్కారు లెక్కలేసుకుంది.

గత ఆర్ధిక సంవత్సరం లెక్కలు చూస్తే ఈ మొత్తం పది వేల కోట్ల రూపాయలు కూడా దాటలేదు. ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. ఓ వైపు కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల ఆశించిన విధంగా రాక..మరో వైపు అప్పులు చేసుకునే అవకాశం లేకపోవటంతో ఈ సారి బడ్జెట్ లోనే భారీ కోతలు పడే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే స‌మ‌యంలో సొంత స్థ‌లం ఉంటే డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌కు మూడు ల‌క్షల రూసాయలు ఇచ్చే స్కీమ్ కూడా ఈ ప‌రిస్థితుల్లో ముందుకు సాగ‌టం అనుమాన‌మే అంటున్నాయి అధికార వ‌ర్గాలు. అప్పుల విష‌యంలో కేంద్రం త‌న వైఖ‌రి మార్చుకోక‌పోతే మాత్రం బ‌డ్జెట్ లో భారీ కోత ప‌డుతుంద‌ని..ఇది రాష్ట్రంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుందని భావిస్తున్నారు.

Next Story
Share it