‘కోట రహస్యాలు ’ కవిత బయటపెడితే ఇక అంతే!

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయిన పదకొండు సంవత్సరాల తర్వాత తెలంగాణ లో తొలిసారి రాజకీయ అనిశ్చిత వాతావరణం కనపడుతోంది. ఇప్పుడు ఉన్న స్థితిలో రాష్ట్రంలో బీజేపీ సొంతంగా గెలిచి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. కారణాలు ఏమైనా కూడా బీజేపీ అధిష్ఠానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపైనే నిర్ణయం తీసుకోలేక పోతోంది. రాష్ట్ర బీజేపీ లో కీలక నేతలు చాలా మంది బిఆర్ఎస్ తో కుమ్మక్కు అయింది నిజమే అంటూ ఆ పార్టీ సీనియర్ నేత , ఎమ్మెల్యే రాజాసింగ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇటీవల వరకు తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు గట్టి..ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బిఆర్ఎస్ ఇప్పుడు బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటు జెండా ఎగరేసి ...కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదు అని తేల్చిచెపుతున్నారు.
కవిత తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేర ప్రభావం చూపుతారు అనే విషయం ఇప్పటికప్పడు ఒక అంచనాకు రావటం కష్టమే కానీ...ఆమె తిరుగుబాటుతో బలంగా ఉంది అనుకున్న బిఆర్ఎస్ పునాదులకు బీటలు వారాయి అనే సంకేతం ఆమె తన చర్యల ద్వారా కలిగిస్తున్నారు. మరో వైపు ఇది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు రాజకీయంగా అత్యంత ఇబ్బందికర..అవమానకర పరిస్థితి అనే చెప్పాలి. సొంత చెల్లినే మీ నాయకత్వాన్ని అంగీకరించటం లేదు..ఇక మేము ఎందుకు అంగీకరించాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే కేటీఆర్ దగ్గర సమాధానం ఉండదు అనే చెప్పొచ్చు. కవిత దూకుడు చూస్తుంటే తనను పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కోటలోని మరిన్ని రహస్యాలు బయటపెట్టే ప్రమాదం ఉంది అనే భయం బిఆర్ఎస్ నేతల్లో ఉంది. అదే జరిగితే బిఆర్ఎస్ కు రాజకీయంగా మరింత నష్టం కలగటం సహజం అనే చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది.
కవిత కొత్తగా జాగృతి ఆఫీస్ ప్రారంభించటంతో పాటు ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తే తన పోరాటం ఎవరితోనే స్పష్టంగా చెప్పేశారు. ఆమె ఇప్పుడు కెసిఆర్ నాయకత్వ వారసత్వం కోరుకుంటున్నారు. పూర్తిగా కాకపోయినా అందులో తనకు కూడా సముచిత వాటా ఉండాలి అని...లేకపోతే మాత్రం ఇలాగే ఉంటుంది అని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక తేల్చుకోవాల్సింది కెసిఆర్, కేటీఆర్ లే. మరో వైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగా ప్రచారంలో ఉన్న కేటీఆర్ కొంత మంది నేతలతో కలిసి పార్టీ కార్యక్రమాల పేరుతో విదేశాల్లో పర్యటించటం చాలా మంది నేతలకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతం ఇస్తుంది అనే భయం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే కవిత కేటీఆర్ ను ఇతర పార్టీ ల నాయకులు విమర్శించిన తరహాలోనే రాజకీయాలు అంటే ట్వీట్లు చేయటం కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణాలో కీలకమైన బిఆర్ఎస్, బీజేపీ ల పరిస్థితి ఇలా ఉంటే ఇక అధికార కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమంత బిందాస్ గా ఏమీ లేదు అనే చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి సర్కారు ఇమేజ్, గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది అనే అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అయితే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్లకుపైగా సమయం ఉన్నందున ఈ లోపు ఎన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే. బిఆర్ఎస్ , బీజేపీ లో ఉన్న అనిశ్చితి ని కాంగ్రెస్ ఏమైనా క్యాష్ చేసుకునే స్థితిలో ఉందా అంటే ఆ పార్టీ లో ఎవరి గోల వాళ్లదే అన్నట్లు వ్యవహారం ఉంటుంది తప్ప ఒక ప్లాన్ ..వ్యూహం ప్రకారం పని చేసే వాతావరణం అక్కడ ఉండదు అనే విషయం అందరికి తెలుసు. కాకపోతే తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం కాస్త కాంగ్రెస్ కు రిలీఫ్ ను ఇచ్చేవే అని చెప్పొచ్చు.