కేటీఆర్ కు బిగ్ షాక్
బిఆర్ఎస్ కు వరస చిక్కులు వచ్చిపడుతున్నాయి. గత ఏడాది ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కెసిఆర్ కుమార్తె..ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె కొన్ని నెలలపాటు తీహార్ జైలు లో ఉన్నారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు లో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అనివార్యంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ హై కోర్ట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టివేయటంతో ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ కు ఉన్న రక్షణ కూడా పోయింది. దీంతో కేటీఆర్ అరెస్ట్ అనివార్యం అని...అది ఎప్పుడు అన్నది మాత్రమే తేలాల్సి ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది కీలక దశకు చేరింది.
మంగళవారం ఉదయమే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు హై కోర్ట్ షాక్ ఇచ్చింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని.. అందరికి రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో నిధుల మళ్లింపు జరిగిదంటూ కేటీఆర్ సహా మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చుతూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. గతంలో రెండు సార్లు ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా.. కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
తర్వాత విచారణలో ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సెక్షన్ 409 వర్తించదు అని, కేటీఆర్‌పై పెట్టిన కేసులు ఏవీ కూడా వర్తించవని హైకోర్టుకు కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎఫ్ఈవోతో ఒప్పందాలు కుదుర్చుకున్న సమయంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, అలాగే కేటీఆర్ లబ్ధిపొందినట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం దృష్టికి కేటీఆర్ తరపు న్యాయవాది తీసుకెళ్లారు. కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. అందుకే ఆయనను ఏ1గా చేర్చామని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని.. కేటీఆర్‌ను విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి పొందామన్నారు.
అలాగే ప్రాథమిక విచారణ తర్వాతే కేసును నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో కేటీఆర్‌ది కీలక పాత్ర ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని క్వాష్ పిటిషన్‌ను డిస్మస్ చేయాలని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న కోర్టు డిసెంబర్ 31న రిజర్వ్ చేస్తూ.. కేసును వాయిదా వేసింది. అయితే మంగళవారం తీర్పు వెలువరించిన హైకోర్టు.. ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హై కోర్ట్ తీర్పుపై అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ తో పాటు బిఆర్ఎస్ నేతలు న్యాయనిపుణలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేటీఆర్ సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించే అవకాశం ఉంది అని బిఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి.