Telugu Gateway
Telangana

ఎక్కడా లేని క్యూలు మద్యం షాపుల దగ్గరే

ఎక్కడా లేని క్యూలు మద్యం షాపుల దగ్గరే
X

కిరాణ దుకాణాల వద్ద క్యూలులేవు. మెడికల్ షాపుల దగ్గర క్యూలు లేవు. కానీ మద్యం దుకాణాల దగ్గర మాత్రం నిత్యావసరాలకు మించి డిమాండ్. అసలు ఆ మందు లేకపోతే ఇక బండి ముందుకు నడవదు అన్న చందంగా హైదరాబాద్ లో మందు బాబులు మద్యం షాపుల దగ్గర బారులు తీరారు. పది రోజులపాటే లాక్ డౌన్ విధిస్తున్నట్లు సర్కారు ప్రకటించినా మందు బాబులు ముందుచూపుతో నెల రోజులకు సరిపడా అంటూ నిత్యావసరాల తరహాలో మందు కొనుక్కుని ఇళ్లకు వెళుతున్నారు. అయితే లాక్ డౌన్ లోనూ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ మద్యం షాపులకు అనుమతి ఉంటుందని సమాచారం. మార్గదర్శకాల్లో ఈ విషయం లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బుధవారం నుంచి తెలంగాణలో పది రోజుల పాటు లాక్ డౌన్ అమలుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కొంత మంది పది రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తున్నారు. షాపుల దగ్గర బారులు తీరిన వారు పెద్ద ఎత్తున బ్యాగుల్లో మద్యం సీసాలు తీసుకెళుతున్న దృశ్యాలు టీవీల్లో దర్శనం ఇచ్చాయి. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తే మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వాల్సిందిగా లిక్కర్‌, బీర్‌ సప్లయర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. లిక్కర్‌ ఉత్పత్తిని కూడా ఆపకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. కరోనా నియంత్రణ కోసం అని లాక్ డౌన్ విధిస్తే మద్యం షాపుల దగ్గర మాత్రం కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేసి మందుబాటు క్యూకట్టారు.

Next Story
Share it