Telugu Gateway
Telangana

'ధ‌రణి' వెన‌క పెద్ద కుట్ర‌

ధ‌రణి  వెన‌క పెద్ద కుట్ర‌
X

'దేశానికే మార్గ‌ద‌ర్శి. ఇక భూస‌మస్య‌లు ఫ‌ట్. ఒక్క మీట నొక్కితే అన్ని వివ‌రాలు వ‌స్తాయి. దేశం అంతా మ‌న‌వైపే చూస్తోంది. ఎంతో క‌స‌ర‌త్తు చేశాకే ధ‌ర‌ణి పోర్ట‌ల్ సిద్ధం చేశాం. ఇక రెవెన్యూలో అవినీతి అంతం. ఇవీ ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు చేసిన ప్ర‌క‌ట‌న‌లు. కానీ ప్రారంభం నుంచి ధ‌ర‌ణి పోర్ట‌ల్ చుక్క‌లు చూపిస్తోంది. అంతే కాదు..త‌ర‌చూ స‌మ‌స్య‌ల‌తో వేధిస్తోంది. అంతా రెడీ అయింద‌ని..అట్ట‌హాసంగా ప్ర‌క‌ట‌న‌లు చేసి..ప్రారంభించిన త‌ర్వాత వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌తో త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చివ‌ర‌కు ప్ర‌భుత్వం మ‌ళ్లీ దీనిపై మంత్రివ‌ర్గ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేసింది'. అంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ వ‌ల్ల ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లపై తెలంగాణ జర్న‌లిస్టుల అధ్య‌య‌న వేదిక శ‌నివారం నాడు రౌండ్ స‌మావేశం నిర్వ‌హించింది. ఇందులో ప‌లువురు నేత‌లు పాల్గొని త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ధ‌ర‌ణి వెన‌క పెద్ద కుట్ర ఉంద‌ని..ఇందులో ఎన్నో త‌ప్పులు ఉన్నాయని ప‌లువురు వ‌క్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను అడ్డం పెట్టుకుని ప్ర‌భుత్వ పెద్ద‌లు భారీ ఎత్తున భూముల‌ను కొట్టేసే ప‌నుల్లో ఉన్నార‌ని కొంత మంది వక్త‌లు వ్యాఖ్యానించారు. న‌ర్సింహారెడ్డి అనే రైతు మాట్లాడుతూ మూడు నెలలుగా 4 వేల మందితో ధరణి భూ సమస్యల బాధితులతో మాట్లాడామ‌ని, ధరణి వచ్చాక‌ సర్వే నం. బ్లాక్ చేయడంతో 20 లక్షల ఎకరాలపై నిషేధించారు.

ఇందులో పట్టాభూములు కూడా ఉన్నాయి. ఏళ్లుగా పాస్ బుక్ ల కోసం తీరుగుతున్నాం. ధరణి లో తప్పులను సరిచేయకుంటే.. సర్కార్ కు ఉరితాడుగా మారుతుంది. ధరణిలో సెక్షన్ 22ఏ అతిపెద్ద సమస్యగా మారింద‌న్నారు. బిజెపి నాయ‌కురాలు డీ కె అరుణ మాట్లాడుతూ ధరణి పోర్టల్ ప్రారంభం పైనే చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఇది ఎందుకు తెచ్చారు. పాసుబుక్ లు ఇచ్చినా భూములు ఎక్కలేదు. ఎన్నో తప్పులు ఉన్నాయి. అధికారులకు చెబితే మా చేతుల్లో ఏం లేదంటున్నారు. పేదలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ధరణి సమస్యలు ఎందుకు పరిష్కారించడం లేదు. ఐటీ శాఖ సీఎం కొడుకు వద్దనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం తెలుస్తోంది. అధికార ప్రజాప్రతినిధులు.. నేతలు భూ దందా చేస్తున్నారు.చిన్న జిల్లాలు అయినా కూడా కలెక్టర్లు భూ సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. వివాదాలు.. సమస్య లు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భూ సేకరణ లో పది ఎకరాలు ఉంటే.. వందల ఎకరాలు పెట్టార‌న్నారు.రాష్ట్రంలో ఉన్న అసైన్డ్ భూమి సగం కూడా ధ‌ర‌ణిలో ఎక్కలేదు. అదంతా అధికార నేతలు తమ ఖాతాల్లో వేసుకునేందుకే ధరణిలోని సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. కలెక్టర్ మినహా మిగతా రెవెన్యూ అధికారులను జీరో చేసింది ప్రభుత్వం. తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ భూ సమస్యలపై న్యాయ నిపుణుల కమిటీ వేయకుండానే ధరణి తెచ్చారు. భూ సమగ్ర సర్వే ను అటకెక్కించిన ప్రభుత్వం. కేసీఆర్ కు చెప్పినా పట్టించుకోడు. దున్న పోతు మీద నీళ్లు చల్లినట్లే ఆయన తీరు ఉంది.. హై కోర్టుకు వెళితేనే పరిష్కారం అవుతుంద‌న్నారు. టీ టీడీపీ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మట్లాడుతూ యూపీఏ హయాంలో భూ డిజిటలైజేషన్ తెచ్చి రాష్ట్రంలో నిజామాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. భూ సమస్యలు చిన్న సన్నకారు రైతులకే వస్తున్నాయి. మ్యాన్యువ‌ల్ గా కూడా భూ రికార్డు లు అప్ డేట్ చేయాలి.

22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు. టెక్నాలజీ పెరిగినా కూడా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ధరణి కి పర్ఫెక్ట్ మెకానిజం ఉండాలి. వ్యవసాయ భూమి తగ్గిపోతుంది. భూమి పై భద్రత.. భరోసా భయంగా మారింది. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ధరణిలో సవరణలను ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు. సెక్షన్ 22ఏను సవరించాలి. ప్రజలు భూ సమస్యల పరిష్కారానికి పార్టీ తరపున మద్దతు ఇస్తామ‌న్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ధరణి వెనక ప్రభుత్వం పెద్దకుట్ర ఉందని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు గుంజుకుంది. ధరణి సాఫ్ట్ వేర్ డేటా బేస్ కు లాక్ ఉండాలి. ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉండదు. అధికార నేతల పనులు త్వరగా చేసుకుని.. ప్రజల పనులకు సర్వ ర్ డౌన్ అని చెబుతారు. మాజీ ఉప ముఖ్య‌మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ మాట్లాడుతూ ధరణి పోర్టల్ ప్రారంభం అయినప్పటి నుంచే అనుమానాలు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు అసైన్డ్ మెంట్ కమిటీ ల ద్వారా భూ సమస్యలు పరిష్కారం చూపేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అసైన్డ్ కమిటీ ని రద్దు చేసింది. అనుభవదారులను గుర్తించమని కేసిఆర్ చెప్పారు. 2014లో తెలంగాణ వచ్చాక భూ సమగ్ర సర్వే చేయకుండా.. ధరణి పోర్టల్ తెచ్చింది. ఇతర రాష్ట్రాలు భూ సమగ్ర సర్వే లు చేసుకున్నాయి.- రాచకొండ భూ సమస్యలపై పిటీషన్.. ఎక్స్ సర్విసు మెన్ భూ సమస్యలపై హై కోర్టులో పిటీషన్లు వేద్దాం. ప్రభుత్వం ఏ పాలసీ తెచ్చినా అందులో ఏదో ఒక కుట్ర దాగి ఉంటుంది. సోమ‌వారం ధ‌ర‌ణిపై కోర్టులో రిట్ వేస్తామ‌న్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాధిక్, ట్రెజరర్ సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story
Share it