కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆమెతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన కిడ్నాప్ కేసులో ఈ పరిణామాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, ఆయన సోదరుడు చంద్రబోసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి అఖిల ప్రియను బేగంపేట్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు.
'కిడ్నాప్ కేసులో నిందితులను అరెస్ట్ చేశాము. ఈ కేసులో పూర్తి విచారణ కొనసాగుతంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, బోయిన్‌పల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. మాకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో ఎవరిపైఅయితే అనుమానం వ్యక్తం చేశారో వారినే అదుపులోకి తీసుకున్నాం. కిడ్నాప్‌కి గురైన ముగ్గురు వ్యక్తులను కూడా సేఫ్‌గా తీసుకొచ్చాము. కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నాము అని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి కెసీఆర్ సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.